Nov 27,2020 10:09

నేను ఈ మధ్య తరచుగా నా బాల్య స్నేహితుడు బినూ రెహమాన్‌ గురించి ఆలోచిస్తున్నాను. ఇంత ఇబ్బందికరమైన సమయంలో కూడా అతని ముఖం నా కళ్ల ముందే తేలియాడుతుంది. మా ఇద్దరిదీ ఒకే ప్రాంతం, కృష్ణా నగర్‌. ఫజ్లూ కాకా కొడుకు బినూ. హిందువులను మించిన హిందువు బినూ. హిందూ నియమాలు, ఆచారాలను బాగా ఆచరిస్తాడు కాబట్టి నాకు బాగా కోపం వచ్చేది. నన్ను కూడా వాటిలో కొన్నింటిని ఆచరించమని అంటే, అతడ్ని చీవాట్లు పెట్టేవాడిని. రూప్‌చంద్‌ జెఠూ అనే నా క్రిస్టియన్‌ మిత్రుడు కూడా సెలవుల్లో ఇంటికి వెళ్ళినప్పుడు కలవలేదని తెలుసుకొని విపరీతంగా తిట్టేవాడు.


అదీ, నాకు తెలిసిన ప్రపంచం. పెద్దలు మా ఇంటికి వచ్చినప్పుడు, నేను వారి పాదాలకు నమస్కరించే వాడిని. వారు హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా తేడా అనిపించేది కాదు. నా చిన్నతనంలో 'మతతత్వం' అనే పదం విన్నాను. కానీ ఆ పదం నా మనసుపై ఎటువంటి ముద్ర వేయలేదు. ఎందుకు? ఆ పదానికి ఇప్పటి పరిస్థితుల్లో ఉన్న ప్రాముఖ్యత అప్పుడు లేదు. 1946లో జరిగిన అల్లర్ల ప్రభావం నదియా లోని ఏ ప్రాంతంలో లేదు. కృష్ణానగర్‌ లో కూడా లేదు. కానీ ఇప్పుడు? మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అనే దాని గురించి ఆలోచిస్తే చాలా నిరాశకు లోనవుతాను. నాకు తెలిసిన నా దేశంలో ఏమిటి ఈ చీకటి? నా దేశం ఎప్పటికైనా ఈ చీకటి నుంచి బయటకు రాగలదా? నాకు తెలిసిన ఈ దేశాన్ని మళ్ళీ చూస్తానో లేదో తెలియదు.


46లో నేను చాలా చిన్నవాడిని. ఏది, ఎందుకు జరుగుతుందో అర్ధం చేసుకోలేనంత చిన్న వయసు. కాలేజీలో చదివే రోజుల్లో కూడా హిందువులకు, ముస్లింలకు మధ్య తేడా ఏమిటో తెలియదు. 'పాకిస్తాన్‌ కోసం జిన్నా పిలుపునకు' మెజారిటీ ముస్లింలు ఎందుకు ఆకర్షితులయ్యారు అనేదే నన్ను ఎప్పుడూ బాధించే ప్రశ్న. ఆ సమయంలో దాదాపు జమీందారులు అందరూ హిందువులుగా వుంటే, మెజారిటీ ముస్లింలు వారికి లోబడి ఉండేవారు. కాబట్టి వారు పీడితులు. పాకిస్తాన్‌లో హిందూ పాలన, హిందూ పీడన ఉండకుండా ప్రత్యేక దేశం ఒకటి ఈ సమస్యలను పరిష్కరిస్తుందని వారు ఆలోచించి వుంటారు. తరువాత కాలంలో ఈ ఆలోచన ఎంత తప్పో రుజువైంది. కాబట్టి వారు 1971లో బంగ్లాదేశ్‌ విముక్తి కోసం మరొక స్వతంత్ర పోరాటం చేయాల్సి వచ్చింది.


తూర్పు బెంగాల్‌ హార్బర్‌ నుంచి ముస్లింలకు వ్యతిరేకంగా కోపంతో వందల సంఖ్యలో శరణార్థుల రాకతో నేను ఆశ్చర్యపోయాను. కానీ బెంగాల్‌ వైపు ఉన్నవారు ఇంకా కోపంతో ఉన్నట్లనిపించింది. తూర్పు బెంగాల్‌ శరణార్థుల కోపంలో గాయం ఉంది, కానీ ప్రేమ కూడా ఉంది. వారు కలిసి మెలిసి జీవించేవారు. ఆ సాన్నిహిత్య భావన వారిలో ఉంది. వారిపై ముస్లింలు దాడి చేసిన సందర్భాలు ఉన్నట్టుగానే, వారిని ముస్లింలు రక్షించిన చరిత్ర కూడా ఉంది. కాబట్టి తూర్పు బెంగాల్‌ నుండి వచ్చిన ప్రజలలో మిశ్రమ భావాలు ఉన్నాయి. కానీ, ఈ భావాలను అనుభవించకుండా కేవలం హింస గురించే వింటున్న ప్రస్తుత తరం మరింత దూకుడుగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ దూకుడుతనాన్ని బహుశా ఎవరో పెంచి పోషిస్తున్నట్టుంది.


మా ఇంట్లో దుర్గా పూజ సందర్భంగా, మతపరమైన విభజన ఉండేది కాదు. మా కుటుంబానికి ఒక రకమైన మత వ్యతిరేక భావన ఉంది. విశ్వాసాలతో నిమిత్తం లేకుండా ఇరుగు పొరుగు వారందరూ ఇంటికి వచ్చి ఆ వేడుకలో పాల్గొనేవారు. మనం ఇప్పుడు తీవ్ర రూపం దాల్చిన మతోన్మాద భావనలను చూస్తున్నాం.2002లో గుజరాత్‌లో భీకరమైన అల్లర్లు జరిగిన సమయంలో అధికారంలో ఉన్న వ్యక్తి, ప్రస్తుతం భారతదేశంలో అధికార పీఠంపై ఉండడం చాలా ఆశ్చర్యం కలిగించింది. భారత దేశ ప్రజలు అతడిని, అతని పార్టీని భరిస్తున్నారు. వారే తిరిగి ఎన్నికవుతున్నారు. బహుశా ప్రజలు ఒక బలమైన ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేయలేకపోతున్నారు. లేదా వారు ఈ రాజకీయాల విష స్వభావాన్ని అర్ధం చేసుకోలేకపోతున్నారు.


కరోనా వ్యాధి సోకడం వల్ల ఎక్కువ మంది ప్రజలు చనిపోతున్న ప్రస్తుత పరిస్థితి తట్టుకోలేనిదిగా ఉంటున్నప్పటికీ, రాముని పేరుతో రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. నవ్వు పుట్టించే విషయమేమంటే, రాముని పేరుతో వారు నిర్మించాలనుకుంటున్న దేవాలయం గురించి మనకు చిన్నతనం నుంచి తెలిసిందే. వందల, వేల సంవత్సరాల నుంచి రాముడు ప్రేమ, ప్రేరణలు ఉన్న స్థలంలో ఉంటున్నాడు. తండ్రికిచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు అడవిలో నివసించేందుకు వెళ్ళిన రాముడు ఇంకా ఆ దేవాలయంలో నివసిస్తాడా? చెప్పండి. తన తండ్రికిచ్చిన మాట నిలబెట్టుకోవడం, అడవిలో నివసించడం, ఇవన్నీ కథలనుకోండి. కానీ మన విలువలన్నీ వాటితో రూపొందించారు. అవి మన విలువలకు గుర్తులుగా మారాయి. ఇప్పుడు ఆ విలువలు ఎక్కడున్నాయి? మనం వాస్తవానికి మన సంస్కృతిని వదిలేస్తున్నాం.


ఈ దేశం ఎక్కడిదాకా వెళ్తుందో నాకు తెలియడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా మితవాదం బాగా బలపడుతున్నది. అన్ని దేశాలలో అన్ని వర్గాల ప్రజలపై ఎంతో కొంత మత ప్రభావం ఉంది. కానీ భారతదేశం, పాకిస్తాన్‌, సౌదీ అరేబియా దేశాలలో మత ఛాందసవాదం చాలా ఎక్కువ. మన దేశంలో కొద్ది మంది మాత్రమే లౌకికతత్వం అంటే ఏమిటో అర్ధం చేసుకోగలుగుతారు. చాలా మంది అర్ధం చేసుకోవాలనుకోరు. ఎందుకంటే రాముడు ప్రతి ఒక్కరి మనోభావాలను పట్టుకున్నాడు, హిందూత్వ శక్తులు తమ మతతత్వ ఎజెండాను అమలు చేసేందుకు రాముడిని ఉపయోగిస్తున్నారు. రాజకీయ లక్ష్యాల కోసం రాముడిని ఉపయోగించుకుంటే, ఎవ్వరూ ఆక్షేపించరని వారు అనుకుంటున్నారు. ఎందుకంటే మెజారిటీ ప్రజలు రాముడు తమ స్వంతవాడని అనుకుంటున్నారు. 1992 లో బాబ్రీ మసీదు కూల్చివేత ఒక పథకం ప్రకారం జరిగింది. దానిని ఆపగలిగిన రాజకీయ పార్టీలన్నీ అప్పుడు ఎక్కడికి పోయాయి? ఈ ప్రశ్న నేను ఎప్పుడూ అడుగుతూనే ఉంటాను.


కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని 60 సంవత్సరాలు ఏలింది. చాలా మంది కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మితవాదులు (బహిరంగంగా కాదు, రహస్యంగా). మనకు ఇప్పటికీ గాంధీజీతో కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ రాజకీయాలలో ఆయన నిజాయితీని మనం కాదనలేం. నేడు ఎంత మంది రాజకీయ నాయకులకు నిజాయితీ ఉంది? ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. గాంధీజీ లౌకికతత్వంపై ఏనాడూ రాజీ పడలేదు. సంపూర్ణమైన హిందువు అయినప్పటికీ, ఆయన ముస్లిం వ్యతిరేక చర్యలలో మునిగి పోలేదు. తనదైన మార్గంలో భారతదేశం ఏమిటో ఆయనకు తెలుసు. ఈ సందర్భంలో జవహర్‌ లాల్‌ నెహ్రూ కూడా లౌకికతత్వంపై ఏనాడూ రాజీ పడలేదనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. సుభాష్‌ చంద్రబోస్‌ కంటే లౌకికవాది మరొకరు లేరని నేను నమ్ముతాను. ఇది, ఆయన స్థాపించిన ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ, ఆయన చర్యల ద్వారా స్పష్టం అవుతుంది. మళ్ళీ సుభాష్‌ చంద్రబోస్‌ దృష్టిలో, గాంధీజీ కంటే గొప్ప భారతీయుడు వేరే ఎవరూ లేరు.


శాస్త్రీయ సంగీత ప్రశంసల క్షీణత చాలా నష్టమని నమ్ముతాను. అభ్యాసకులు తమ వ్యక్తిగత జీవితంలో హిందువులు లేదా ముస్లింలు అయి ఉండవచ్చు. కానీ వారంతా కళాకారులు. నాకు ఒక సంఘటన గుర్తుకు వస్తుంది. భాస్కర్‌ బువా అనే ఒక మరాఠీ బ్రాహ్మణుడు శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందేందుకు ఆగ్రా వెళ్లాడు. సమర్థులైన ఉస్తాద్‌లు ఆగ్రాలో నివసించేవారు. అలాంటి ఒక ఉస్తాద్‌కు బువా శిష్యుడయ్యాడు. సంవత్సరం కాలం మొత్తం గురువు బువాను కుండలో నీళ్ళు నింపే పనిలో ఉంచాడు. ఇది శిష్యునికి సంగీతం నేర్చుకోవాలనే కోరిక ఎంత ఉందో తెలుసుకునే పరీక్ష. అతనికి ఓపిక, సహనం కూడా ఎంత ఉందో పరీక్షించాడు. బువా ఈ విధంగా సంవత్సరం గడిపాడు.'నేను ఫలానా రోజు నుండి పాఠాలు మొదలు పెడతానని' ఉస్తాద్‌ ఒక్కసారి కూడా చెప్పలేదు. ఒక రోజు బువా వాకిలి ఊడుస్తుండగా, 'నాకు మాంసం తినాలని అనిపిస్తుంది, వెళ్ళి తీసుకొని రమ్మని', ఉస్తాద్‌ చెప్పాడు. బువా ఏడ్వడం మొదలైంది. ఒక మరాఠీ బ్రాహ్మణుడు మాంసం ఎలా కొంటాడు?


ఒకవేళ ఎవరైనా చూస్తే ఎలా? 'ఇంత చిన్న పని చేయలేవా? అయితే ఇంటికి వెళ్ళు. నీకు పాఠాలు చెప్పడం కుదరదు' అని ఉస్తాద్‌ అన్నాడు. వేరే మార్గం లేక, బువా మాంసం తీసుకొని వచ్చి గురువు పాదాల దగ్గర పెట్టాడు. దానిని వండమని అనడంతో, ఏడుస్తూ వండాడు. వంట చేసే కొలిమిలో పడిపోయి ఉండాల్సిన పరిస్థితిలో బువా ఉన్నాడు. చివరికి ఉస్తాద్‌, 'నీ శిక్షణ రేపటి నుంచి మొదలవుతుందని' అన్నాడు.
గొడ్డు మాంసం తినే నాటకాన్ని చూసినప్పుడు నాకు చెప్పలేనంత కోపం వచ్చింది. అంత తక్కువ ధరకు అంత ఎక్కువ మాంసకృత్తులు ఉన్న ఆహారం ఎక్కడ దొరుకుతుంది? ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు గొడ్డు మాంసం తింటారు. ముఖ్యంగా, ఇతరులు ఏం తినాలో, ఏం తినకూడదో నిర్ణయించేందుకు వారు ఎవరు? గొడ్డు మాంసం తినని ఒక హిందువు దానిని తినడాన్ని ఆక్షేపించవచ్చు. కానీ ఆ ఆక్షేపణను ఇతరులపై ఎందుకు రుద్దాలి? ప్రజల ఆహారపు అలవాట్లను ఆదేశించడం అంటే ఏ స్థాయికి దిగజారామో అర్ధం చేసుకోవచ్చు. గొడ్డు మాంసం తిన్నాడనే పేరుతో ముస్లింలను హత్య చేస్తున్నారు. ఇంతకు ముందు మనం భారతదేశంలో దీనిని చూడలేదు. మన దేశం ఎలా నిర్మించబడిందో మన పాఠ్యపుస్తకాల్లో మనకు చెప్పిన విధంగా మనం భారతదేశాన్ని చూశాం.


రామ మందిరానికి పునాది రాయి వేసిన నాటి నుంచి రవీంద్రనాథ్‌ టాగూర్‌ రచించిన 'దీనో దాన్‌' (ద గిఫ్ట్‌ ఆఫ్‌ డెస్టిట్యూట్‌) పద్యంపై చాలా చర్చ సాగుతూ ఉంది. రవీంద్రనాథ్‌ టాగూర్‌ ఎప్పటికీ ప్రాసంగికత ఉన్న వ్యక్తి. ఆయన జమీందారుల కుటుంబంలో పుట్టి ఉండకపోతే, తన సంస్థానం పనిలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణం చేయకుండా ఉండి ఉంటే రవీంద్రనాథ్‌ అయ్యేవాడు కాదు. ఆయన ప్రాసంగికతకు కాల పరిమితి ఉండేది కాదు. బెంగాల్‌ ప్రజలను ప్రేమించగలిగే వాడు కాదు. ఆయన పట్టణ వాసిగానే ఉండి ఉంటే దేశాన్ని ఏ విధంగా అర్ధం చేసుకొని ఉండేవాడు? ఒక బ్రాహ్మణునిగా తన మతం పట్ల ఏ విధమైన సనాతన అభిప్రాయాలు లేవు. వాస్తవంగా ఆయనకు హిందువుల అభిప్రాయాలతో చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.


నేను ఇక్కడ విద్యాసాగర్‌ గురించి కూడా ప్రస్తావిస్తాను. గొప్ప సంస్కృత పండితుడైనప్పటికీ ఆయన ఇంగ్లీష్‌ సాహిత్య బోధనకు ప్రాధాన్యత ఇచ్చారు. వేదాలను, వేదాంతాలను బోధించే కంటే 'బేకన్‌' శాస్త్రీయ భావాలను బోధించడం ముఖ్యమని ఆయన చెప్పాడు. ఛాందసవాదాన్ని సృష్టించేందుకు మతాన్ని, రాజకీయాలను తెలివిగా ఒకదానితో ఒకటి ముడి పెడుతున్నారు. రామ్‌, రహీం లను ఎవరు ప్రేమిస్తున్నారనేది ఇక్కడ సమస్య కాదు. అందుకే వీటన్నింటికీ పరిష్కారంగా వామపక్షమే ప్రత్యామ్నాయంగా ఉండాలని నేను భావిస్తున్నాను.
- సౌమిత్ర ఛటర్జీ
- ఇటీవల మరణించిన సౌమిత్ర చటర్జీ 'దాదాసాహెబ్‌ ఫాల్కే' అవార్డు గ్రహీత, థియేటర్‌ ఆర్టిస్ట్‌, రచయిత, నటుడు ('న్యూస్‌ క్లిక్‌' సౌజన్యంతో)