Oct 25,2021 08:03
  • సర్వే పూర్తయి ఏడేళ్లు గడుస్తున్నా కదలని థర్డ్‌ లైన్‌ పనులు
  • గోపాలపట్నం- విశాఖ 3వ లైన్‌ పనుల్లో కానరాని పురోగతి

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు రైల్వే డివిజన్‌ను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎత్తివేయడమే కాకుండా, ఈ డివిజన్‌ పరిధిలోని పలు రైలు ప్రాజెక్టుల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. వాల్తేరు పరిధిలో సర్వే పూర్తయి ఏళ్లు గడుస్తున్నా కీలకమైన థర్డ్‌ లైన్‌, డబ్లింగ్‌, ఎలక్ట్రిఫికేషన్‌ పనుల విషయంలో తీవ్ర తాత్సారం చేస్తోంది.
    దేశంలోనే కీలకమైన రైల్వే కేంద్రం వాల్తేరు (విశాఖపట్నం). ప్రతి రోజూ 120 రైళ్లు ఈ మహానగరం మీదుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. కోవిడ్‌-19 వచ్చాక ప్రస్తుతం 90 రైళ్లు నడుస్తున్నాయి. రైళ్ల రద్దీ కారణంగా విశాఖపట్నం అవుటర్‌లో వాటిని నిలిపేయడం, ట్రాఫిక్‌ డైవర్షన్‌ నిత్యకృత్యమైంది. రైలు లైన్ల పనుల్లో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపకపోవడమే ఇందుకు కారణం.

                                                      రైల్వే పెండింగ్‌ ప్రాజెక్టులు...

గోపాలపట్నం-విశాఖపట్నం ఎనిమిది కిలోమీటర్ల థర్డ్‌ లైన్‌ కోసం 2015లోనే సర్వే పూర్తయినా నేటికీ నిధులు విడుదల చేయలేదు. అప్పట్లో రూ.106 కోట్లు అంచనా వేయగా, జాప్యం కారణంగా ఇప్పుడు నిర్మాణ వ్యయం రూ.160 కోట్లకు పెరిగింది. ఈ లైను పూర్తి కానందున విశాఖపట్నం జంక్షన్‌కు సమీపాన రైళ్లను గంటల కొద్దీ నిలిపేయాల్సి వస్తోంది. కంచరపాలెం, గోపాలపట్నం, అనకాపల్లి, దువ్వాడ వద్ద ఇది నిత్యకృత్యంగా మారిపోయింది. విజయనగరం-పలాస (బైపాస్‌ లైన్‌) సర్వే పూర్తయింది. రూ.1200 కోట్లు అంచనా వ్యయంతో రూపొందించబడిన థర్డ్‌ లైన్‌ పనులకు మోక్షం కలగడం లేదు. పాత రైలు ప్రాజెక్టు గోపాలపట్నం-విజయనగరం థర్డ్‌ లైన్‌ ఒక్కటే 2014 నుంచి 2021 వరకూ బిజెపి పాలనలో పూర్తయింది. విజయనగరం-టిట్లాగర్‌ 3వ లైనుకు క్లియరెన్స్‌ ఇవ్వలేదు. కెకెలైన్‌ డబ్లింగ్‌, ఎలక్ట్రిఫికేషన్‌ రూ.7 వేల కోట్లతో 470 కిలోమీటర్లు జరగాల్సిన ప్రాజెక్టుకు కేంద్ర రైల్వే బోర్డు అనుమతి ఇవ్వలేదు. రూ.1,200 కోట్లతో రాయగడ-కోరాపుట్‌ 170 కిలోమీటర్ల డబ్లింగ్‌ పనులకు అతీగతీ లేదు.
 

                                           కీలక డివిజన్‌పై తొలి నుంచీ చిన్నచూపే...

రైల్వే చరిత్రలో ఏటా రూ.6,500 కోట్లు టర్నోవర్‌ సాధించడంలోనూ, రైలు ట్రాఫిక్‌లోనూ కీలకమైన వాల్తేరు రైల్వే డివిజన్‌ ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల పరిధిలో విస్తరించి ఉంది. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలోపాటు ఒడిశాలోని కోరాపుట్‌, రాయగడ, గజపతి జిల్లాలు, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌, దంతేవాడ కూడా దీని పరిధిలోనే ఉన్నాయి. వాల్తేరు రైల్వే డివిజన్‌ఉసురు తీసిన బిజెపి ప్రభుత్వం, దీని పరిధిలోని పలు ప్రాజెక్టులను చేపట్టకుండా ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం చేస్తుండడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.