
డెహ్రడూన్ : ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిపై సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారన్న ఆరోపణలపై జర్నలిస్ట్ ఉమేష్ శర్మపై నమోదైన కేసును రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. నోట్ల రద్దు తర్వాత ముఖ్యమంత్రి, బిజెపి నేత త్రివేంద్ర సింగ్ రావత్‌కు సమీప బంధువుల ఖాతాల్లో జార్ఖండ్‌కు చెందిన అమ్రితేష్ చౌహాన్ పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేశారంటూ పోస్టులో పేర్కొన్నారు. త్రివేంద్ర రావత్ వ్యక్తిగత ప్రయోజనాల నిమిత్తం..ఆయన బంధువులైన హరేంద్ర సింగ్ రావత్, ఆయన భార్య సవితా రావత్ బ్యాంక్ ఖాతాలో ఆ వ్యక్తి డబ్బులు జమ చేశాడని ఆ పోస్టు సారాంశం. ఆ పోస్టుకు బ్యాంకు స్టేట్మెంట్లను కూడా జత చేశారు. దీంతో సదరు జర్నలిస్టు..తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని, అవి తప్పుడు ఆధారాలని పేర్కొంటూ హరేంద్ర సింగ్ జులై 31న ఫిర్యాదు చేయడంతో ఉమేష్‌పై కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలంటూ జర్నలిస్ట్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన జస్టిస్ రవీంద్ర మిథానీ...కేసును కొట్టివేస్తూ...ఈ ఘటనపై సిబిఐ విచారణకు ఆదేశించారు. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించాలని పేర్కొన్నారు. జర్నలిస్ట్ ఉమేష్ తరుపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదించారు.