Oct 14,2021 21:26

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఉత్తరాఖండ్‌లో బిజెపి ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి సొంత జిల్లా ఉద్ధమ్‌ సింగ్‌ నగర్‌లో స్థానిక రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసనను ఎదుర్కొన్నారు. రైతులు తొలుత మండి వద్ద గుమిగూడారు. ఆ తరువాత సిఎం ఉపయోగిస్తున్న హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుని, నల్ల జెండాలతో ఆందోళన చేపట్టారు. రాబోయే రోజుల్లో ఇటువంటి నిరసనలను తీవ్రతరం చేస్తామని రైతు నాయకులు ప్రకటించారు. రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు కైలాష్‌ మేఘ్వాల్‌కు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టారు. అక్కడ వృద్ధ రైతుపై లాఠీల వర్షం కురిపించిన పోలీసు అధికారి నరేష్‌ గెహారాను సస్పెండ్‌ చేయాలని కోరుతూ రైతులు కలెక్టరేట్‌ వెలుపల నిరవధిక నిరసన చేపట్టారు. హర్యానాలోని హిసార్‌లో ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఓం ప్రకాష్‌ ధంకర్‌కు వ్యతిరేకంగా రైతులు జిజె యూనివర్శిటీ వెలుపల నల్ల జెండాలతో నిరసన తెలిపారు.
షహీద్‌ అస్తిక యాత్రలు
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరి నుండి ప్రారంభమైన షహీద్‌ అస్తిక యాత్రలు వివిధ ప్రదేశాలకు వెళ్లాయి. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ జిల్లా జిరాలో శుక్రవారం భారీ కిసాన్‌ మహాపంచాయత్‌ జరుగుతుంది.
రాయపూర్‌ చేరుకున్న ఆదివాసీల హస్డియో బచావో యాత్ర
ఛత్తీస్‌గఢ్‌లో వందలాది మంది ఆదివాసీలు గత 10 రోజులుగా ''హస్డియో బచావో యాత్ర''లో భాగంగా 300 కిలోమీటర్లకు పైగా నడిచి, రాష్ట్ర రాజధాని రాయపూర్‌ చేరుకున్నారు. ఆదివాసుల సంస్కృతి, జీవనోపాధిలో అంతర్భాగమైన అడవులను కాపాడాలని, పెద్ద మైనింగ్‌ కార్పొరేషన్ల దోపిడీని నిలువరించాలని, వివిధ రాజ్యాంగ, చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ హస్డియో బచావో యాత్ర నిర్వహించారు.