Jan 27,2021 23:22

ఉత్తమ ప్రదర్శన బహుమతి అందజేస్తున్న నిర్వాహకులు

ప్రజాశక్తి- పెద్దాపురం 'మండలంలోని చంద్రమాంపల్లి (దివిలి)లో స్నేహ హార్ట్స్‌ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి నాటిక పోటీలు విజయవంతంగా ముగిశాయి.' ఈ పోటీలకు న్యాయనిర్ణేతగా కొత్తం స్వామినాథన్‌, గోగులపాటి సీతారామస్వామి, ప్రసాద్‌రెడ్డి వ్యవహరించారు. ఈ పోటీల్లో ఎనిమిది నాటికలు ప్రదర్శించారు. వీటిలో లిఖిత సాయి శ్రీ క్రియేషన్స్‌ గోవాక షుగర్స్‌ వారు ప్రదర్శించిన 'పంపకాలు' నాటిక ఉత్తమ ప్రదర్శనగా ఎంపికైంది. దీన్ని బి.శ్రీనివాసరావు రచించగా, సుబ్రహ్మణ్య సతీష్‌ దర్శకత్వం వహించారు. ఎస్‌బిఐ మేనేజర్‌ మురళీకృష్ణ జ్ఞాపికను, బహుమతిని అందజేశారు. ద్వితీయ ప్రదర్శనగా శ్రీసాయి ఆర్ట్స్‌ కొలకలూరి వారు ప్రదర్శించిన 'తలుపులు తెరిచే ఉన్నాయి' ఎంపికైంది. భారతుల రామకృష్ణ రచించిన ఈ నాటికకు గోపరాజు విజరు దర్శకత్వం వహించారు. క్రాంతికుమార్‌, బుర్ర రత్నం బహుమతులు అందజేశారు. తృతీయ ప్రదర్శనగా ద అమెచ్యూర్‌ డ్రమెటిక్‌ అసోసియేషన్‌ చిలకలూరిపేట వారు ప్రదర్శించిన 'అక్క అలుగుడు- చెల్లి సనుగుడు' నాటిక ఎంపికైంది. ఈ నాటికను అద్దేపల్లి భారత్‌ కుమార్‌ రచించగా, షేక్‌ షఫీ దర్శకత్వం వహించారు. వీరికి దొంతుకుర్తి సర్వేశ్వరరావు బహుమతులు అందజేశారు. ఉత్తమ ఆహార్యం ధామస్‌ (రాతిలో తేమ), ఉత్తమ సంగీతం లీలా మోహన్‌ (తలుపులు తెరిచే ఉన్నాయి), ఉత్తమ రంగాలంకరణ యంగమాంబ థియేటర్స్‌ (రాతిలో తేమ), ఉత్తమ క్యారెక్టర్‌ నటుడు లక్ష్మీనారాయణ (తలుపులు తెరిచే ఉన్నాయి), ఉత్తమ నటి సురభి ప్రభావతి (తలుపులు తెరిచే ఉన్నాయి) ఎంపికయ్యారు. వీరికి బహుమతులను అందించారు.
ఉత్తమ నాటకాలకు ప్రజాదరణ
ఉత్తమ నాటక ప్రదర్శనలకు ప్రజాదరణ ఎప్పుడూ ఉంటుందని నన్నయ్య యూనివర్సిటీ మాజీ వైస్‌ ఛాన్సలర్‌ ముత్యాలనాయుడు అన్నారు. స్నేహ ఆర్ట్స్‌ అధ్యక్షులు జి.రాజా అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. అనాది కాలంగా మన సమాజంలో నాటకం తన వంతు పాత్ర నిర్వహిస్తోందన్నారు. నాటకానికి పూర్వ వైభవం తెచ్చేందుకు కళాకారులు, కళా సంస్థలు, ప్రోత్సాహకులు కృషి చేయాలన్నారు. హైకోర్టు సీనియర్‌ లాయర్‌ కె.బుచ్చిరామన్నదొరను ఘనంగా సన్మానించారు. ఈ సభలో కేదారి నాగు, ఎం.సత్తిబాబు, రవి, పాపేశ్వరరావు, పండు, బి.వెంకటరత్నం పాల్గొన్నారు.