Apr 08,2021 19:03

ఒకప్పుడు ఆ గ్రామంలో పేదరికం తాండవించేది. ఆకలితో పస్తులు పడుకునేవారు. పాలకుల నిర్లక్ష్యానికి ప్రతిబింబంగా నిలిచిన ఆ గ్రామం ఇప్పుడు విభిన్న కళలకు కేంద్రంగా విరాజిల్లుతోంది. నగరాల నుంచే కాక, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది ఆ గ్రామాన్ని సందర్శించేందుకు వస్తున్నారు. అది పశ్చిమ బెంగాల్‌ ఝారగ్రామ్‌ రైల్వేస్టేషనుకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న 'ఖ్వాబ్‌ గావ్‌'.


ఖ్వాబ్‌ గావ్‌లో ప్రతి ఇల్లూ మట్టిగోడలతో కట్టి ఉంటుంది. ఇప్పుడా గోడలపై ఆహ్లాదకర రంగుల్లో వేసిన చిత్రాలు దర్శనమిస్తున్నాయి. వాటిని చూస్తే ఎవరో చేయి తిరిగిన కళాకారుడు వచ్చి వేశాడేమో అనుకుంటారు. కాని కట్టెలు కొట్టుకుని, జీవనం సాగించే ఆదివాసీల కుంచెల నుంచే ఆ చిత్రాలు వచ్చాయంటే ఆశ్చర్యం కలుగక మానదు.

ఆ ఊరొక బొమ్మల కొలువు


'ఖ్వాబ్‌ గావ్‌' అసలు పేరు 'లాల్‌ బజార్‌'. ఇది ఓ కుగ్రామం. దశాబ్దాల పాటు మౌలిక వసతులు లేక, వ్యవసాయం కలిసిరాక కరువు కోరల్లో చిక్కుకున్న ఎన్నో గ్రామాల్లో ఇదొకటి. పరిస్థితులు మరికొన్నేళ్లు అలాగే గడిస్తే బహుశా ఈ ప్రాంతం కూడా అంతరించిపోయేదే. 'లోధా షబర్‌' అనే ఆదివాసి తెగకు చెందిన కుటుంబాలు అక్కడ నివసించేవి. వారంతా అడవిలో కట్టెలు కొట్టుకుని వచ్చిన సంపాదనతో జీవించేవారు. ఎన్నేళ్లు గడిచినా అవే జీవితాలు.. అప్పుడే ఆ గ్రామానికి కలకత్తా నుంచి 'చలచిత్రా అకాడెమీ' నుంచి కొంతమంది కళాకారులు వచ్చారు. వారికి ఆ గ్రామ పరిసరాలు ఎంతో నచ్చాయి. అడవి మధ్యలో విసిరివేయబడినట్లు ఉన్నా ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఆ వాతావరణం యూరోపియన్‌ కళాకారుడి కుంచె నుంచి వచ్చిన ఓ అందమైన చిత్రపటంలా వారికి తోచింది. అందుకే ఎలాగైనా ఆ గ్రామాన్ని సజీవంగా ఉంచాలనుకున్నారు.

ఆ ఊరొక బొమ్మల కొలువు


అలా జరగాలంటే ఆ ఆదివాసీల జీవన పరిస్థితుల్లో మార్పులు రావాలి. అందుకే కేవలం కట్టెలు కొట్టుకుంటే సరిపోదు. ప్రత్యామ్నాయంగా ఏదైనా చేయాలనుకున్నారు. ఆ ఆలోచనలోంచే లాల్‌బజార్‌ కాస్తా 'ఖ్వాబ్‌ గావ్‌'గా మారింది. మొదట గ్రామస్తుల సహకారంతో గ్రామంలోని ప్రతి మట్టిగోడపై వివిధ రంగులతో చిత్రాలు వేశారు. అందులో బాలబాలికలను భాగస్వామ్యం చేశారు. అలా మొట్టమొదట ఓ 20 మంది భాగస్వామ్యంతో ఆ కార్యక్రమం ప్రారంభమైంది. కొన్ని రోజుల్లో ఆ గ్రామమంతా ఎక్కడ చూసినా రంగుల చిత్రాలే. గ్రామస్తులే ఆశ్చర్యపోయేంతలా గ్రామం రూపురేఖలు మారిపోయాయి. క్రమేణా యువతీ యువకులు కూడా వారితో చేయికలిపారు.

ఆ ఊరొక బొమ్మల కొలువు


ఏడాది తరువాత ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ ఈ కళలో ఆరితేరారు. ఒకప్పుడు పండుగ వచ్చినప్పుడే మట్టిగోడలకు రంగులు వేసేవారు. కాని ఇప్పుడు సందర్భం ఏదైనా తమ కళను ప్రదర్శించే వేదికలుగా ఆ మట్టిగోడలను ఉపయోగిస్తున్నారు. కోవిడ్‌ సమయంలో మాస్కు ధరించడంపై అవగాహన కల్పించేందుకు కొంతమంది మాస్క్‌ చిత్రాలు గీస్తే, మరికొంతమంది భౌతికదూరం సూచించే బొమ్మలు వేశారు. బెంగాల్‌ సంస్కృతి ప్రతిబింబించేలా సాంప్రదాయ చిత్రాలతో కొన్ని గోడలు కనబడితే .. మరికొన్ని వారి ఆదివాసీ కళలకు నెలవుగా ఉంటున్నాయి.

ఆ ఊరొక బొమ్మల కొలువు

మార్పు దిశగా..
ఆ మట్టిగోడపై అక్టోబరు 2019లో మొట్టమొదటి బొమ్మ వేశారు. ఇప్పుడు... గ్రామమంతా ఓ కాన్వాస్‌లా కనబడుతోంది. గ్రామస్తుల ఉత్సాహం చూసిన అకాడెమీ సభ్యులు చేతితో తయారు చేసే వివిధ రకాల బొమ్మలు చేయడంలో గ్రామస్తులకు శిక్షణ ఇచ్చారు. దీంతో అది వారి జీవనోపాధికి ఎంతో ఉపయోగపడింది. షష్తి చరణ్‌ అహిర్‌(42) విభిన్న ప్రతిభావంతుడు. అతను తయారుచేసిన బొమ్మలతో నెలకు రూ.4000 ఆదాయం సంపాదిస్తున్నాడు. 'కటుంకుటుం' పేరుతో మట్టి, చెక్క, వివిధ రకాల చెట్ల వేర్లు, కొబ్బరి చిప్పలు తదితరాలతో ఆ బొమ్మలను తయారుచేస్తున్నారు. 'ఈ శిక్షణ నాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. డబ్బు ప్రధానం కాదు. కొత్తగా ఏం చేయగలనో అని ప్రతిరోజూ ఆలోచిస్తూ ఉంటాను. ఒకప్పుడు ఇలా ఉండేవాడిని కాను' అంటాడు అహిర్‌. ఇప్పుడు ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ తమకు వచ్చిన కళల్లో ప్రతిభ చూపుతున్నారు. కొంతమంది మట్టిగోడలపై బొమ్మలు వేస్తుంటే, మరికొంతమంది వెదురు చాపలను అందమైన కాన్వాస్‌లుగా మార్చేస్తున్నారు. మరికొంతమంది రకరకాల క్రాప్ట్‌ తయారీలో శిక్షణ తీసుకుంటున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి ఉత్సాహవంతులైన పిల్లలు ఈ కళలో శిక్షణ తీసుకుంటున్నారు కూడా. ఇప్పుడు ఈ ఊరొక బొమ్మల కార్యశాలలా, కళానెలవులా దర్శనమిస్తోంది.

ఆ ఊరొక బొమ్మల కొలువు