Apr 14,2021 07:56

ప్రకాశం : ఆ ఊరిలో రహదారి అధ్వాన్నంగా ఉంది. బస్సులను నడపలేమంటూ.. ఆర్టీసీ అధికారులు బస్సుల సౌకర్యాన్ని ఆపేశారు. గ్రామస్థులంతా కలిసి ప్రభుత్వాధికారిని కలిసి విన్నవిస్తే.. ఆ రోడ్డును బాగుచేయడం కష్టం అని తేల్చి చెప్పేశారు. దీంతో ఆ ఊరంతా ఒక్కటయింది. అధికారులను అవాక్కయ్యేలా చేసింది. గ్రామస్థులంతా ఒక్కటై ఆ రోడ్డును వేశారు. శభాష్‌ అనిపించుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం కూడా చేయలేని పనిని వారు స్వయంగా చేసి చూపించారు.
   ప్రకాశం జిల్లా పామూరు మండలం రేణిమడుగు, అక్కంపేట రహదారి అధ్వానంగా ఉంది. రోడ్డు మొత్తం రాళ్లు తేలి, గుంతలు ఏర్పడింది. చిల్లచెట్లు దట్టంగా పెరిగి దారి కూడా సక్రమంగా కనిపించడం లేదు. కల్వర్టులు, వాగుల దగ్గర గోతులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆర్‌టిసి అధికారులు ఈ గ్రామాలకు బస్సు రాకపోకలను నిలిపివేశారు. దీంతో ఆయా గ్రామాల వాసులు మండల కేంద్రమైన పామూరు రాకపోకలు సాగించేందుకు, విద్యార్థులు కంభాలదిన్నె ఉన్నత పాఠశాలకు వెళ్లి చదువుకునేందుకు ఇబ్బందులుపడ్డారు.
   తమ గ్రామానికి బస్సు నడపాలని కోరుతూ.. కనిగిరి ఆర్‌టిసి సిఐ కామేశ్వరికి ఇటీవల ఆయా గ్రామం వినతిపత్రాన్ని అందజేసింది. బస్సు నడపడం కష్టమని ఆమె తేల్చి చెప్పారు. దీంతో రెండు గ్రామాలవాసులు ఒక్కటై చర్చించుకున్నారు. తామే రహదారిని బాగు చేసుకోవాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా 20 మంది గ్రామస్థులు ఒక జట్టుగా ఏర్పడ్డారు. జేసీబీ, మూడు ట్రాక్టర్లను ఏర్పాటు తెచ్చి గుంతలను పూడ్చారు. చిల్ల చెట్లను తొలగించారు. ఎత్తుపల్లాలు సరి చేయించారు. రహదారిని బాగుచేసుకున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి తమ ఊరికి బస్సు నడిపి తమ కష్టాలు తీర్చాలని వారు కోరుతున్నారు. మరి, ఆర్‌టిసి అధికారులు వారి మొరను ఆలకిస్తారో లేదో.. ఆ ఊరికి బస్సు సౌకర్యాన్ని కల్పిస్తారో లేదో చూడాలి..!