Mar 02,2021 21:44

గుంతకల్లులో నామినేషన్‌ ఉపసంహరించుకుంటున్న టిడిపి అభ్యర్థి గుత్తి యాస్మిన్‌

       అనంతపురం ప్రతినిధి : మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. గతేడాది మార్చి 12వ తేదీన పరిశీలన అనంతరం వాయిదాపడ్డ విషయం తెలిసిందే. వీటిని తిరిగి నిర్వహించేందుకు గత నెలలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యుల్‌ను ప్రకటించింది. దీని ప్రకారం ఈనెల రెండు, మూడు తేదీల్లో ఉపసంహరణలు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం నుంచి ఉపసంహరణలు మొదలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం మూడు గంటలతో ఇవి ముగియనున్నాయి. మొదటి రోజే పెద్దఎత్తున ఉపసంహరణలు జరిగాయి. జిల్లాలో అనంతపురం నగర పాలక సంస్థతోపాటు, ఆరు పురపాలక సంఘాలు, నాలుగు నగర పంచాయతీలకు కలిపి మొత్తం 352 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇది వరకే నామినేషన్లు దాఖలు చేసి పరిశీలన కూడా పూర్తై ఉన్నాయి. ఇప్పుడు ఉపసంహరణలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో ఆయా పార్టీల తరుపున నామినేషన్లు దాఖలు చేసిన వారికి బి-ఫారమ్‌లను నేడు అందజేయాల్సి ఉంటుంది. అనంతరం గుర్తుల కేటాయింపు జరుగుతుంది. దీంతో మంగళవారం నాడే అటు టిడిపి, ఇటు వైసిపి రెండు పార్టీల నుంచి అభ్యర్థులను ఖరారు చేశాయి. ప్రకటించిన మేరకు ఆయా అభ్యర్థులకే బి-ఫారమ్‌లను అందజేయనున్నారు. బి-ఫారమ్‌ దక్కనివారు స్వతంత్రులుగా ఉంటారు. ఆయా పార్టీల తరుపున ఒక్కో వార్డుకు నాలుగైదు కూడా నామినేషన్లు దాఖలై ఉన్నాయి. వాటిని ఉపసంహరించుకోవాలన్న బుజ్జగింపులు కొనసాగుతున్నాయి.
మొదటి రోజే 15 వార్డులు ఏకగ్రీవం
మొదటి రోజే టిడిపికి షాక్‌ తగిలింది. 15 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇవన్నీ కూడా వైసిపికి చెందిన వారే కావడం గమనార్హం. ఇందులో ధర్మవరం పురపాలక సంఘం పరిధిలోనే పది వార్డుల్లో మొదటి రోజు ఉపసంహరణల అనంతరం సింగిల్‌ నామినేషన్లు అయ్యాయి. దీంతో ఈ వార్డులు ఏకగ్రీవమైనట్టుగా తెలుస్తోంది. అదే రకంగా తాడిపత్రిలోనూ మూడు వార్డులు సింగిల్‌ నామినేషన్‌ అయ్యాయి. గుత్తి, గుంతకల్లు మున్సిపాలిటీల్లోనూ ఒక్కొక్కవార్డు ఏకగ్రీవమయ్యాయి. అయితే వీటిని అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. నేడు నామినేషన్ల ఉపసంహరణల ప్రక్రియ అనంతరం అధికారులు వీటిని ప్రకటించే అవకాశముంది.
నామినేషన్ల ఉపసంహరణలు ఇలా...
అనంతపురం నగర పాలక సంస్థతోపాటు పురపాలక సంఘాలకు ఎన్నికలు జరుగుతున్న 11 వాటిల్లోనూ కలిపి 352 వార్డులకుగానూ 2280 నామినేషన్లు దాఖలై ఉన్నాయి. ఉపసంహరణల మొదటి రోజు అన్నింటిలోనూ కలిపి 267 నామినేషన్లు ఉపసంహరించబడ్డాయి. పార్టీల పరంగా చూసినప్పుడు 146 నామినేషన్లు వైసిపి నుంచి ఉపసంహరించబడ్డాయి. టిడిపి నుంచి 68, బిజెపి నుంచి 8 కాగ, తక్కినవి ఇతర పార్టీలు, స్వతంత్రులున్నారు.
వైసిపిలో అసంతృప్తులు
పురపాలక సంఘం ఎన్నికల్లో వైసిపిలో తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే పోటీని తగ్గించి, అభ్యర్థులను ఖరారు చేసేందుకే సోమవారం నాడు పార్టీ నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం మంగళవారం నాడు ఆయా పురపాలక సంఘాల్లోని అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి ఎమ్మెల్యేలు జాబితాను విడుదల చేశారు. టిక్కెట్టు దక్కని అభ్యర్థులు తమ అసంతృప్తి వ్యక్తం చేయడమేకాకుండా కొన్ని చోట్ల స్వతంత్రంగా బరిలో దింగేందుకు సైతం సిద్ధపడ్డారు. అలాంటి వారిని బుజ్జగించే ప్రయత్నాలను నేతలు చేపట్టారు. నేటి వరకు ఉపసంహరణల గడువు ఉండటంతో ఏ మేరకు వారి ప్రయత్నాలు ఫలిస్తాయో చూడాల్సి ఉంది.