Dec 05,2021 17:51

ప్రజాశక్తి - పాలకోడేరు
విస్సాకోడేరుకు చెందిన మానుపాటి శివాజీ తెలుగు ఉపాధ్యాయునిగా ఉద్యోగం సాధించాడు. పేదరికంలో పుట్టిన శివాజీ ఒకరిపై ఆధారపడకుండా కష్టపడి చదువుకొని అతి చిన్న వయసులోనే ఉన్నత స్థానానికి చేరాడు. చదువుకు పేదరికం అడ్డు కాదని శివాజీ నిరూపించాడు. ఇటీవల కాళ్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల అసిస్టెంట్‌ తెలుగు ఉపాధ్యాయుడిగా శివాజీ ఉద్యోగం పొందారు. చిన్న వయసులోనే ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించిన శివాజీ ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆదివారం విస్సాకోడేరులో గ్రామ సర్పంచి బొల్ల శ్రీనివాస్‌, మాజీ సర్పంచి పెనుమత్స, వైసిపి ముఖ్య నాయకులు దుండి అశోక్‌బాబు, చేబోలు బాలాజీ శివాజీని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అతి చిన్న వయసులోనే శివాజీ ఉద్యోగం పొందడం అతని గొప్పతనమన్నారు. శివాజీ అంచెలంచెలుగా ఎదిగి మరింత అభివృద్ధి సాధించాలన్నారు. ఉపాధ్యాయుడు శివాజీ మాట్లాడుతూ ఎంతోమంది ఎన్నో రకాలుగా అవహేళన చేసినా పట్టించుకోకుండా ముందుకు సాగానని తెలిపారు. అవహేళన చేసిన వారే ఇప్పుడు మెచ్చుకుంటున్నారని చెప్పారు. ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.