Dec 03,2021 22:51
  • పిఆర్‌సి, డిఎ అమలు, సిపిఎస్‌ రద్దు కోసం జరిగిన
  • ఎమ్మెల్సీల నిరసన దీక్షలో వివిధ సంఘాల నేతలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికులు, కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలపై దీర్ఘకాలిక సమరశీల పోరాటాలు సాగించక తప్పదని వివిధ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. పిఆర్‌సి నివేదిక ఇచ్చి ఏడాదవుతున్నా దానిని బయటపెట్టేందుకు ప్రభుత్వం ఎందుకు జంకుతోందని నిలదీశారు. ఏడు డిఎలు ఇస్తామని, అధికారంలోకి వచ్చిన వారంలోనే సిపిఎస్‌ను రద్దు చేస్తామన్న హామీ కార్యరూపం దాల్చలేదన్నారు. ఈ నేపథ్యంలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక సంఘాలతోపాటు ఐక్య జెఎసి ఉద్యమించక తప్పదని హెచ్చరించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, కెఎస్‌ లక్ష్మణరావు, యండపల్లి శ్రీనివాసులురెడ్డి, ఐ వెంకటేశ్వరరావు, స్వతంత్ర ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, పి రఘువర్మ ఒక రోజు నిరసన దీక్ష విజయవాడలోని ధర్నా చౌక్‌లో శుక్రవారం చేపట్టారు. ఈ దీక్షను ఎపి జెఎసి చైర్మన్‌ బండి శ్రీనివాసరావు, ఎపి జెఎసి అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా జెఎసి నేతలు మాట్లాడుతూ 13 లక్షల మంది ఉద్యోగులు ఆందోళన చేస్తుంటే సిఎం జగన్‌కు వినపడటం లేదా అని ప్రశ్నించారు. న్యాయమైన సమస్యలపై ఉపాధ్యాయ, ఉద్యోగులు, కార్మికులు ఆందోళన చేస్తున్నా, సిఎం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్సీలు ప్రశ్నలు వేసినా సమాధానం రాకపోవడంతో, ఎమ్మెల్సీలే దీక్షకు దిగవలసి వచ్చిందన్నారు. ఉద్యోగులను విస్మరించిన ప్రభుత్వాలకు గతంలో ఏ గతి పట్టిందో ఒక్కసారి గుర్తుకుతెచ్చుకోవాలని హెచ్చరించారు. ఈ దీక్షలలో ఫ్యాప్టో చైర్మన్‌ సిహెచ్‌ జోసెఫ్‌ సుధీర్‌బాబు, సెక్రటరీ జనరల్‌ సిహెచ్‌ శరత్‌ చంద్ర, కో చైర్మన్లు ఎన్‌ వెంకటేశ్వర్లు, వి శ్రీనివాసరావు, కె కులశేఖర్‌రెడ్డి, కె భానుమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీల నిరసన దీక్షకు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి ఉమామహేశ్వరరావు, శ్రామిక మహిళ ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మీ, ఆర్‌టిసి ఎస్‌డబ్ల్యూఎస్‌ ప్రధాన కార్యదర్శి సుందరయ్య, విద్యార్థి, యువజన సంఘాల నేతలు సంఘీభావం ప్రకటించారు.

ఇబ్బందేంటో చెప్పరు
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఎంటో చెప్పడంలేదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటుందే గానీ, ఎప్పటికీ సమస్యలు పరిష్కరిస్తుందో స్పష్టం చేయడంలేదు. కనీసం ఉద్యోగ సంఘాలను చర్చలకూ పిలవడంలేదు. సిఎం జగన్‌ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. శాసనమండలిలో ప్రశ్నలు వేసినా సమాధానం లేదు. చేసేదిలేక ఉద్యోగుల సమస్యల కోసం నిరసన దీక్షకు దిగాం.
- విఠపు బాలసుహ్మ్రణ్యం

రాజకీయంగానే న్యాయం
ఉద్యోగుల సమస్యలకు సిఎం జగన్‌ రాజకీయంగానే న్యాయం చేయగలరు. ఎంతసేపు అధికారులే ఉద్యోగ సంఘాలతో భేటీ అవుతున్నారే గానీ, సిఎం ఎందుకు సమావేశం పెట్టరు? పిఆర్‌సి, డిఎ అమలు, సిపిఎస్‌ రద్దుపై జగన్‌ మ్యానిఫెస్టోలో పెట్టారు. అధికారంలోకి వచ్చిన వారంలోనే పరిష్కరిస్తామన్నా, నేటికీ కార్యరూపం దాల్చలేదు. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు ఉద్యమం కొనసాగుతుంది.
- కెఎస్‌ లక్ష్మణరావు

ప్రభుత్వంలో ఉద్యోగ భద్రత ఏదీ..!
కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌, సచివాలయ ఉద్యోగులకు ఈ ప్రభుత్వంలో ఉద్యోగ భద్రత లేదు. ఎందుకు తొలగిస్తారో చెప్పరు. అందరినీ రెగ్యులరైజ్‌ చేస్తామన్న హామీని నెరవేర్చడం లేదు. ఉద్యోగులకుఏడు డిఎలు పెండింగ్‌లో ఉన్నాయి. పిఆర్‌సి, డిఎ అమలు, సిపిఎస్‌ రద్దుపై స్పష్టమైన ప్రకటన చేయాలి.
- యండపల్లి శ్రీనివాసులురెడ్డి

ఏ సిఎం ఇంత మొండిగా వ్యవహరించలేదు
ఉమ్మడి రాష్ట్రంలోనూ, విభజిత ఎపిలోనూ ఏ సిఎం జగన్‌ మాదిరిగా మొండిగా వ్యవహరించలేదు. చివరకు ఆయన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సైతం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల సమస్యలపై వెంటనే స్పందించేవారు. ఇదే వైఖరి కొనసాగితే ఉద్యమ పదును పెంచాల్సి వస్తుంది.
- కత్తి నరసింహారెడ్డి

కలిసేందుకు సంఘ నాయకులకే అవకాశం లేదు
సిఎం జగన్‌ రెండున్నరేళ్లగా ఆయా సంఘాల నేతలు కలిసేందుకే అవకాశం ఇవ్వడంలేదు. పదే పదే 151 మంది ఉన్నామంటూ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పోరాడి సాధించుకున్న హక్కుల కోసం మరోసారి ఉద్యమిస్తాం.
- ఐ వెంకటేశ్వరరావు

విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారు
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారు. జాతీయ విద్యా విధానానిు బిజెపి పాలిత రాష్ట్రాలలోనే అమలు చేయడంలేదు. ఎపిలో మాత్రం ముందుగానే చేసేస్తున్నారు. ఎన్‌ఇపిపై ఉపాధ్యాయ సంఘాలు, నిపుణులతో చర్చించనేలేదు. అదేరీతిలో ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇకపై సహించే ప్రసక్తేలేదు.
- పి రఘువర్మ

ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికుల సమస్యలపై సమరశీల పోరాటాలు

ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికుల సమస్యలపై సమరశీల పోరాటాలు

ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికుల సమస్యలపై సమరశీల పోరాటాలు

ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికుల సమస్యలపై సమరశీల పోరాటాలు