Jun 13,2021 08:08

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఉపాధిహామీ పథకం కింద కులం పేరుతో చెల్లింపులు చట్ట విరుద్ధమని దళిత శోషణ్‌ ముక్తి మంచ్‌ (డిఎస్‌ఎంఎం) పేర్కొంది. ప్రజలను తప్పుదారి పట్టించడానికి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జారీ చేసిన మెమోను వెంటనే ఉపసంహరించుకోవాలని శనివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేసింది. కులం ఆధారంగా ఈ విభజన, చెల్లింపులు చేయడం కుల వివక్షకు, చెల్లింపులలో అనవసరమైన ఆలస్యానికి దారితీస్తుందని డిఎస్‌ఎంఎం పేర్కొంది. కులం ఆధారంగా చెల్లించే ఈ పద్ధతి ఉపాధిహామీ చట్టం స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేసింది. కులం ఆధారంగా చెల్లించిన మొత్తంలో వ్యత్యాసం గురించి కొన్ని ప్రాంతాల నుంచి నివేదికలు ఉన్నాయని, ఇది సమాన పనికి సమాన వేతనమనే ప్రాథమిక హక్కుకు వ్యతిరేకంగా ఉందని పేర్కొంది. ఇది సార్వత్రిక కార్యక్రమమని, ఇందులో మతం, లింగం, జాతి ఆధారంగా ప్రజల పట్ల వివక్ష చూపకూడదని స్పష్టం చేసింది. కొన్ని ప్రదేశాలలో పని దినాల సంఖ్య 20 రోజులకు తగ్గిపోయిందని, ఇది అట్టడుగు, ఆర్థికంగా వెనుకబడిన ప్రజల జీవనోపాధిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని తెలిపింది. రోజుకు కనీస వేతనం డిమాండ్‌ రూ.600 ఉండగా, ఉపాధిహామీ కార్మికులకు రూ.200 కంటే ఎక్కువ లభించడం లేదని పేర్కొంది. ఈ సమయంలో పని దినాల సంఖ్యను పెంచడానికి, చెల్లింపులను పెంచడానికి ప్రయత్నం చేయాలి గానీ, అందుకు విరుద్ధంగా కులం పేరుతో విభజనకు పాల్పడటం దారుణమని తెలిపింది. ఇది మొత్తం పథకాన్ని నిర్వీర్యం చేయడం తప్ప మరొకటి కాదని విమర్శించింది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వారి జనాభాలో వాటా ఆధారంగా నిధుల కేటాయింపును తప్పనిసరి చేసిన సబ్‌ ప్లాన్‌ను అమలు చేయాలని డిమాండ్‌ చేసింది. అందుకు భిన్నంగా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపును తగ్గించడం ఈ కుల వర్గీకరణను స్పష్టం చేసిందని పేర్కొంది.