
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్ : ఉపా చట్టం కింద జిల్లాలో నలుగురు ప్రజాసంఘాల నాయకులపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఉపా చట్టం వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ పి.దానేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌పై కలెక్టరేట్ వద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యాన సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నంలో భాగంగా అక్రమ కేసులు బనాయిస్తూ నిర్బంధాన్ని అమలు చేసేందుకు కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. దళిత హక్కుల కోసం పోరాడుతున్న కెన్పిఎస్ నాయకులపైన, ప్రజలను చైతన్యపరిచే కళాకారులు, మహిళా సంఘాల ప్రతినిధులపై ఉపా చట్టాన్ని ప్రయోగించడం సరికాదన్నారు. సంబంధం లేని కేసుల్లో రాష్ట్రవ్యాప్తంగా 30మంది ప్రజాసంఘాల నాయకులపై ఉపా చట్టం కింద కేసులు పెట్టారని తెలిపారు. ఈ చట్టం కింద కేసులు నమోదు చేసిన ఏఒక్కరూ సంబంధిత కేసులతో సంబంధం లేని వారేనని చెప్పారు. కుట్రలో భాగంగానే జిల్లాకు చెందిన అమరుల బంధుమిత్రుల కమిటీ నాయకులు జోగి కోదండరావు, ప్రజా కళామండలి నాయకులు కొర్రాయి నీలకంఠం, చైతన్య మహిళా సంఘం నాయకులు పోతనపల్లి అరుణ, కుల నిర్మూలన పోరాట సమితి నాయకులు మిస్కా కృష్ణయ్యపై విశాఖపట్నం రూరల్, గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పోలీస్స్టేషన్లలో అక్రమ కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఉప చట్టం కింద కేసులు పెట్టడం వెనుక హక్కులను కాలరాసే కుట్ర దాగి ఉందన్నారు. ప్రజలకు, ప్రజా ఉద్యమాలకు అండగా నిలుస్తున్న పౌర, ప్రజాస్వామికవాదులు, మేధావులు, కళాకారులు, సాహిత్యకారులపై అక్రమంగా ఉపా చట్టాన్ని ప్రయోగించి అరెస్టులు సాగిస్తూ నిర్బంధిస్తోందన్నారు. కేసులను ఉపసంహరించి, అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ జె.నివాస్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ధర్నాలో ఐఎఫ్టియు నాయకులు నేతింటి నీలంరాజు, మహిళా సంఘం నాయకులు కృష్ణవేణి, కెఎన్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మిస్కా కృష్ణయ్య, పలు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.