Nov 30,2020 22:50

ధర్నాలో మాట్లాడుతున్న చిలకా చంద్రశేఖర్‌

ప్రజాశక్తి-గుంటూరు : ప్రధాని మోడీపై హత్యాయత్నం చేశారన్న రోపణతో పాస్టర్‌ స్టాన్‌ స్వామితో సహా 16 మందిని భీమాకోరెగావ్‌ కుట్ర కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమంగా అరెస్ట్‌ చేశాయని ఆంధ్రప్రదేశ్‌ పౌర హక్కుల సంఘం కార్యదర్శి చిలకా చంద్రశేఖర్‌ అన్నారు. ఉపా చట్టం రద్దు చేయాలని, అరెస్ట్‌ చేసిన వారిని విడుదల చేయాలని ఉపా చట్టం రద్దు కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షులు గనిరాజు అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో చంద్రశేఖర్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యలపై ఉద్యమిస్తున్న ప్రజలకు అండగా నిలుస్తున్న ప్రజాస్వామిక వాదులు, మేధావుల్ని ఉపా చట్టం కింద అరెస్ట్‌ చేస్తుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. విశాఖ పట్టణంలోని మంచంగి పుట్ట పోలీసు స్టేషన్‌లో, పిడుగురాళ్ల పోలీసు స్టేషన్‌లో ప్రజా సంఘాల నాయకులకు మావోయిస్టులతో సంబంధాలున్నా యనే నెపంతో 80 మందిపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేసి, జైలు పాలు చేయటం దారుణమన్నారు. తక్షణమే కేసులను ఉపసంహరించుకోవాలని, ఉపా చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో కెఎన్‌పిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి కె.కృష్ణ, విజయ భాస్కర్‌, నీలాంబరం, ఎఐకెఎంఎస్‌ నాయకులు ఎన్‌.బ్రహ్మయ్య, ప్రగతిశీల న్యాయవాదుల వేదిక అడ్వకేట్‌ సురేష్‌బాబు పాల్గొన్నారు.