Nov 30,2020 20:05

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌
              అన్‌ లాఫుల్‌ యాక్టివిటీస్‌ ప్రీవెన్షన్‌ యాక్ట్‌ (ఉపా) చట్టాన్ని రద్దు చేయాలని, ప్రశ్నించే వారిని, న్యాయం కోసం పోరాడే వారిని ఈ చట్టం కింద అక్రమ కేసులు బనాయించి, అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం ఏలూరులోని కలెక్టరేట్‌ వద్ద ఉపా రద్దు పోరాట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉగ్రవాదులు, తీవ్రవాదులు, దేశద్రోహులు, దేశ రహస్యాలను బట్టబయలు చేసే వారు తదితర తీవ్రమైన నేరాలు చేసే వారిపై ప్రయోగించాల్సిన చట్ట విరుద్ధ కార్యకలాపాల నిషేధ చట్టాన్ని సామాన్యులపైన, ప్రశ్నించే వారిపైన, న్యాయం కోసం పోరాడే వారిపైన ప్రయోగించడాన్ని వ్యతిరేకిస్తూ వివిధ ప్రజాసంఘాలతో ఏర్పడిన ఉపా రద్దు పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. పౌరహక్కుల సంఘం, ఐఎఫ్‌టియు, కెఎన్‌పిఎస్‌, ఎఐకెఎంఎస్‌, పికెఎస్‌, పిడిఎస్‌యు, పిడిఎం తదితర సంఘాలతో ఏర్పడిన పోరాట కమిటీ చేపట్టిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పౌరహక్కుల సంఘం (సిఎల్‌సి) రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఉపా రద్దు పోరాట కమిటీ రాష్ట్ర కో కన్వీనర్‌ ఎన్‌.శ్రీమన్నారాయణ, ఐఎఫ్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి, పోరాట కమిటీ జిల్లా కన్వీనర్‌ యు.వెంకటేశ్వరరావు(యువి), కెఎన్‌పిఎస్‌ జిల్లా అధ్యక్షులు జాన్‌రాజు, ఎఐకెఎంఎస్‌ జిల్లా కార్యదర్శి తలారి ప్రకాష్‌, పికెఎస్‌ జిల్లా కార్యదర్శి మస్తాన్‌, పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షులు కె.నాని, పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కెవి.రత్నం, ఐఎఫ్‌టియు జిల్లా సహాయ కార్యదర్శి బద్దా వెంకట్రావు ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన పౌరస్వేచ్ఛను ఉపయోగించుకుని ప్రజాసంఘాలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తుంటే వాటిని నిషేధించి, ఆ సంఘాలకు నాయకత్వం వహించే వారిని అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని విమర్శించారు. బీమా కోరేగావ్‌ కేసును అడ్డంపెట్టుకుని ఇప్పటికే 16 మంది మేధావులను వివిధ జైళ్లలో నిర్బంధించారని వివరించారు. మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఈ చట్టంకింద విశాఖ, గుంటూరు జిల్లాల్లోనూ రెండు కేసులు నమోదు చేసి, 21 మందిని అక్రమంగా కేసుల్లో ఇరికించారని వారు పేర్కొన్నారు. చైతన్య మహిళా సంఘం నాయకులు రాజేశ్వరి, అమరుల బంధుమిత్రుల సంఘం నాయకురాలు అంజమ్మలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని వారు ఖండించారు. పౌరహక్కుల, ప్రజాసంఘాల నాయకులపై ఈ చట్టం కింద కేసులు పెట్టడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే జైళ్లలో ఉన్న ప్రొఫెసర్‌ సాయిబాబా, వరవరరావు తదితరులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మన రాష్ట్రంలో కొత్తగా నమోదు చేసిన రెండు కేసులను రద్దుచేసి, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. పూర్తిగా ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో భవిష్యత్తులో ఉద్యమం మరింత ఉధృతమవుతుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టియు నాయకులు అప్పారావు, జి.రాంబాబు, వీరినాయుడు, కెఎన్‌పిఎస్‌ నాయకులు రవీంద్ర పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం : ఉప చట్టం రద్దు చేయాలని కెవిపిఎస్‌, దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక తాలూకా కూడలిలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమ చేపట్టారు. ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కళింగ లక్ష్మణరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం వీరబాబు, సభ్యులు మెరిపో జాన్‌రాజు, ఉయ్యూరు ప్రసాద్‌, ముప్పిడి బాబూరావు పాల్గొన్నారు.