Nov 22,2020 17:58

జార్ఖండ్‌: తండ్రి ఉద్యోగాన్ని పొందడం కోసం కసాయిగా మారాడు ఓ కొడుకు. కన్నతండ్రినే అత్యంత దారుణంగా కడతేర్చాడు. ఈ ఘటన జార్ఖండ్‌లోని రామ్‌ఘర్‌ జిల్లా బార్కకానాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం కృష్ణరామ్‌(55) అనే వ్యక్తి సెంట్రల్‌ కోల్‌ ఫీల్డ్స్‌ (సిసిఎల్‌) వర్క్‌షాప్‌లో హెడ్‌ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నారు. ఈయన కుమారుడు (35) పిఎస్‌యు(పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌టేకింగ్‌)లో కారుణ్య నియామకం పొందేందుకు పథకాన్ని రచించుకున్నాడు. దాని ప్రకారమే బుధవారం అతని తండ్రిని అతను నివసించే క్వార్టర్‌లోనే గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. ఈ దారుణ సంఘటనపై సబ్‌డివిజనల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ ప్రకాష్‌చంద్రమాతో ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఘటన జరిగిన తర్వాత అనుమానం వచ్చి రామ్‌ పెద్దకొడుకును విచారిస్తుండగా తానే కారుణ్య నియామకం పొందడానికి తండ్రిని చంపానని ఒప్పుకున్నాడు. అతని వద్ద నుండి చిన్న కత్తిని, మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సిసిఎల్‌ నిబంధనల ప్రకారం సర్వీసులో ఉండగానే ఓ ఉద్యోగి చనిపోతే అతని కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం లభిస్తుంది.