Oct 27,2021 23:35

ధర్నా చేస్తున్న స్వీపర్లు, కార్మికులు

ప్రజాశక్తి - వంగర: ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్‌ స్వీపర్స్‌, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, రాజకీయ వేధింపులు, తొలగింపులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని, బకాయి వేతనాలు చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్‌ రామ్మూర్తినాయుడు డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక ఎంఇఒ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఏళ్లుగా పనిచేస్తున్న శానిటేషన్‌ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించకుండా పని చేయించుకోవడం సరైంది కాదన్నారు. వారికి తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. వీరిపై రాజకీయ వేధింపులు ఆపాలన్నారు. బకాయి పడిన ఐదు నెలల వేతనం తక్షణమే చెల్లించాలని అన్నారు. మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్స్‌, యూనిఫాం ఇవ్వాలని, ఇఎస్‌ఐ, పిఎఫ్‌ సదుపాయం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనరు వై.అప్పలస్వామి, సత్యవతి, అప్పమ్మ, లక్ష్మి, లలిత, తదితరులు పాల్గొన్నారు.