Nov 30,2020 21:24

మాట్లాడుతున్న కమిషనర్‌ ఎస్‌ఎస్‌ వర్మ

విజయనగరం టౌన్‌ : నగరంలో అనుమతిలేని, అనధికార భవన నిర్మాణాల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ప్రణాళిక కార్యదర్శులకు, సిబ్బందికి నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎస్‌ఎస్‌ వర్మ హెచ్చరించారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కమిషనర్‌ ప్రణాళిక కార్యదర్శులను ఉద్దేశించి మాట్లాడారు. నగరంలో అనుమతిలేని భవన నిర్మాణాలు చేపట్టకూడదని, అలాంటి పనులను పరిశీలించి నిలిపివేయాలని కార్యదర్శులకు స్పష్టం చేశారు. కార్యదర్శులు ప్రతిరోజు తమ వార్డు పరిధిలో క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని, తద్వారా గమనించిన అక్రమ కట్టడాలను నిలిపివేయాలని చెప్పారు. అనుమతి లేని భవనాలను కూల్చివేయడంలో వెనుకాడబోమని స్పష్టం చేశారు. లే అవుట్‌ క్రమబద్ధీకరణ పథకం పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని చెప్పారు. అలాగే భవన నిర్మాణ ప్రాంతంలో ఇంకుడు గుంతల నిర్మాణాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ప్రతి ఇంటి నిర్మాణం వద్ద మొక్కలు నాటేలా నిర్మాణదారుల్లో చైతన్యం నింపాలన్నారు. వారానికోసారి తమతో పాటు అసిస్టెంట్‌ సిటీ ప్లానర్లు కూడా పర్యవేక్షిస్తారని వెల్లడించారు. ఎసిపి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నగరంలో ప్రణాళిక కార్యదర్శులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించి, ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా, అక్రమ నిర్మాణాలను నిరోధించడంలో కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. సమావేశంలో టిడిపిలు కనకారావు, శ్రీలక్ష్మి, జనార్ధన్‌, ప్రణాళిక కార్యదర్శులు పాల్గొన్నారు.