Apr 05,2021 18:48

దేశంలో ఎన్నికలు వచ్చాయంటే రాజకీయపార్టీల హడావుడి అంతాఇంతా కాదు. ప్రజాకర్షక ప్రవాహంలో ఎన్నో కొట్టుకువస్తుంటాయి. అత్యధిక మందిని పట్టి పీడిస్తున్న దీర్ఘకాలిక సమస్యలపై అప్పటివరకు కిమ్మనకుండా ఉన్నవారంతా ఈ ఎన్నికలలో గొప్ప ఉపన్యాసాలు ఇచ్చేస్తుంటారు. ప్రజల బాధలన్నీ ఒక్కపెట్టున తీర్చేస్తామంటారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పనులను శరవేగంగా జరిపించేస్తుంటారు. ఇక అప్పుడే బడ్జెట్‌ సమావేశాలుంటే ఎన్నికలు జరిగే రాష్ట్రాలు వరాల జల్లులో తడిసిముద్దవుతాయి. అలా ఈ 2021 అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నో ఉచిత ప్రకటనలు విన్నాం. దేశం యావత్తు కరోనా వ్యాక్సిన్‌ అవసరమైన పరిస్థితుల్లో 'మేం గెలిస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తామని బీహార్‌ ఎన్నికలలో ప్రధాని మోడీయే స్వయంగా ప్రకటించారు. ఉచిత హామీ ప్రకటనలు ఎంత దిగజారతాయో ఈ ప్రకటనే చెబుతోంది. ఆ జాబితాలో ఉచిత ఇళ్లు, ఉచిత మంచినీళ్ల పథకాలు, ల్యాప్‌టాప్‌లు, మిక్సీలు, టీవీలు ఎలాగో ఉంటాయి. ఈ విధానాలతో విసిగిపోయిన ఓ అభ్యర్థి సరైన మార్గం ఎంచుకోమని ప్రజలను హెచ్చరిస్తున్నాడు. తమిళనాడు మదురై దక్షిణ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి శరవణన్‌ ప్రజలను మేలుకోల్పే లక్ష్యంతో వినూత్నంగా ముందుకెళుతున్నాడు.

మీ బ్యాంకు ఖాతాలో రూ.కోటి జమ...మీ ఇంట్లోనే పార్కు చేసుకునే వీలున్న ఓ హెలికాప్టర్‌, పెళ్లిళ్లకు బంగారు ఉంగరాలు, మూడంతుస్థుల బంగ్లా, ఇంటి పని తగ్గించుకునేందుకు రోబో, ప్రతి కుటుంబానికి ఒక పడవ, తన నియోజకవర్గాన్ని చల్లగా ఉంచేందుకు 300 అడుగుల ఎత్తు ఉన్న కృత్రిమ మంచుపర్వతం స్థాపన, రాకెట్‌ లాంచింగ్‌ కేంద్రం, అంతరిక్ష పరిశోధనా కేంద్రం...అంటూ శరవణన్‌ తన మ్యానిఫెస్టో ప్రకటించాడు. చంద్రుడి మీదకు ఉచితంగా ట్రిప్‌ వేస్తానని కూడా చెప్పాడు. ఆ మ్యానిఫెస్టో బయటకి వచ్చిన తరువాత అతనికేమైనా పిచ్చా? ఇవన్నీ సాధ్యమా? అని చాలామంది ఆశ్చర్యపోయారంట. అయితే ఆ ప్రకటనల వెనుక ఉన్న మంచి ఉద్దేశానికి ఇప్పుడు కొంతమంది అతణ్ణి ప్రశంసిస్తున్నారు.

స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన 33 ఏళ్ల శరవణన్‌ ఉచిత పథకాల వెనుక గొప్ప ఉద్దేశమే ఉంది. సాధారణంగా ప్రతి ఎన్నికలకు వివిధ పార్టీల అభ్యర్థులు తమ మ్యానిఫేస్టోలో ఇలాంటివే ఎన్నో ప్రకటించేస్తూ ఉంటారు. అవన్నీ నెరవేరుస్తారా? అంటే... అసలు వాటి ఊసే ఎత్తని ఘనాపాటీలెందరో మనకు తెలుసు. అందుకే ఈ ఉచిత హామీలనబడే ప్రలోభాలకు పడిపోకుండా ఓటర్లను అప్రమత్తం చేసేందుకే ఈ పనిచేసానంటున్నాడు ఆయన. ప్రజలకు మేలు చేసే అభ్యర్థులనే ఓటర్లు ఎన్నుకోవాలి అంటాడాయన.

ఈ మాటలు వింటుంటే గతం గుర్తుకొస్తోంది. 2014 ఎన్నికలప్పుడు బిజెపి మ్యానిఫెస్టోలో కూడా ఇటువంటి ప్రలోభాలు చాలానే ఉన్నాయి. ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 వేలు జమ. పదేళ్లలో 25 కోట్ల మందికి ఉద్యోగాల కల్పన, రైతులకు కనీస మద్దతుధర, మహిళా హక్కుల రక్షణకు పెద్దపీట, మరీ ముఖ్యంగా దేశం దాటి తరలిపోయిన నల్లధనం తిరిగి ఇండియాకు తీసుకురావడం. 'అచ్చే దిన్‌'... ఇలాంటివి చాలానే చెప్పారు. ఇవన్నీ ఎంతవరకు జరిగాయో దేశపౌరులకు తెలిసిందే. ఇంత తెలిసినా ఇంకా కొంతమంది కసాయివెంట గొర్రెల మందలా తలంచుకుని పోతున్నారు. ఇదిగో శరవణన్‌ లాంటి సామాన్యులు అప్పుడప్పుడూ తమకు అందివచ్చిన వేదిక ద్వారా తమ నిరసన ఇలా తెలియజేస్తుంటారు. 'తాను గెలవకపోయినా తన మ్యానిఫెస్టో ఉద్దేశం ప్రజలకు చేరితే చాలు. అదే నా విజయం' అంటాడు శరవణన్‌.