Jun 11,2021 11:18

న్యూఢిల్లీ : ట్విట్టర్‌ నుండి నోటీసులు వచ్చాయన్న కారణాన్ని చూపి ప్రముఖ రాజకీయ కార్టూనిస్ట్‌ మంజుల్‌ను ప్రముఖ వ్యాపార దిగ్గజం, అపర కుబేరుడు అనిల్‌ అంబానీ మీడియా సంస్థ 'నెట్‌వర్క్‌ 18' విధుల నుండి బహిష్కరించింది. మీ పేజీపై చర్యలు తీసుకోవాలంటూ భారత్‌కు చెందిన ఉన్నతాధికారులు ఆదేశించారని పేర్కొంటూ ట్విట్టర్‌ మంజుల్‌కు నోటీసులు జారీ చేసింది. ఇది జరిగిన నాలుగు రోజుల తర్వాత ఈ నెల 8న ఆయనను ఉద్యోగం నుండి నెట్‌వర్క్‌ 18 తొలగించింది. మంజుల్‌ ఆరు సంవత్సరాలుగా కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన నెట్‌ వర్క్‌ 18లో పనిచేస్తున్నారు. ఆయనను విధుల నుండి తొలగిస్తారన్న సూచనలేమీ లేవని, కానీ ఆకస్మికంగా యాజమాన్యం తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేసిందని నెట్‌వర్క్‌ 18 వర్గాలు తెలిపాయి.
ఈ నెల 4న తనకు ట్విట్టర్‌ నుండి వచ్చిన మెయిల్‌ను తన ట్విట్టర్‌ ఖాతా 'మంజుల్‌ ట్యూన్స్‌'లో షేర్‌ చేశారు. అందులో ట్విట్టర్‌ ఖాతా కంటెంట్‌ భారత చట్టాలను ఉల్లంఘించినట్లు ఇక్కడి అధికారులు భావించినందున.. సదరు ఖాతాపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయినట్లు సోషల్‌ మీడియా దిగ్గజ సంస్థ పేర్కొంది. తన ఫ్రొఫెల్‌లో ఈ మెయిల్‌ను షేర్‌ చేసిన ఆయన... దానికి 'జై హో మోడీజీ కి సర్కార్‌ కి (మోడీ ప్రభుత్వాన్ని అందరూ ప్రశంసించాలి)' అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. అలాగే తాను చేసిన ఏ ట్వీట్‌ వల్ల సమస్య వచ్చిందో ప్రభుత్వం చెప్పి ఉంటే బాగుండేదని ఆయన చురక అంటించారు. కాగా, ఇది ప్రభుత్వం వద్ద నుండి వచ్చిన అభ్యర్థన కావడంతో మేము ఆ విషయాన్ని సదరు ఖాతాదారునికి తెలియజేస్తున్నామని, తాము ఎటువంటి చర్యలు ప్రారంభించడం లేదని పేర్కొంది. ఇదే అంశం ఆయనకు అనుకూలంగా మారే అవకాశాలున్నాయి. దీన్ని ఆధారంగా చేసుకుని మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా న్యాయపరంగా పోరాడే అవకాశం ఆయనకు ఇచ్చినట్లుయింది. కాగా, మంజుల్‌కు ట్విట్టర్‌ నుండి వచ్చిన నోటీసుపై స్పందించిన విపక్ష నేతలు... మోడీ సర్కార్‌ నియంతృత్వ పోకడ అనుసరిస్తుందని మండిపడ్డారు.