Oct 28,2021 20:28

న్యూఢిల్లీ  :   మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమ పునరుద్ధరణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ.. గాంధీ మనవడు తుషార్‌ మెహతా గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. ప్రపంచ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేందుకు వీలుగా ఆశ్రమాన్ని పునరుద్ధరించనున్నట్లు కేంద్రం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదన గాంధీ వ్యక్తిగత అభిప్రాయాలకు విరుద్ధంగా ఉందని, ఆయన ప్రత్యేకతను మసకబార్చే విధంగా ఉందని, పర్యాటక ఆకర్షణను తగ్గిస్తుందని పిల్‌లో న్యాయవాది భూషణ్‌ ఓజా వాదించారు. 1200 కోట్లతో 2019లో కేంద్రం ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది. 48 ఎకరాల వారసత్వ ఆస్తులతో కలిపి 54 ఎకరాల్లో ఆకర్షణాత్మకంగా విఐపి అతిధి గృహాలు, నూతన మ్యూజియం (అక్కడ మ్యూజియం ఉన్నప్పటికీ), ఫుడ్‌ కోర్టులు, దుకాణాలతో గోళాకృతిలో తీర్చిదిద్దనున్నట్లు పేర్కొంది. గతేడాది మార్చిలో గుజరాత్‌ ప్రభుత్వం ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ప్రాజెక్ట్‌ను పర్యవేక్షించడానికి కార్యనిర్వాహక మండలి, పాలకమండలిని ఏర్పాటు చేసింది. అహ్మదాబాద్‌ మునిసిపల్‌ కార్పోరేషన్‌ యాజమాన్యంలోని సబర్మతి రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ ద్వారా ప్రణాళిక అమలు చేయబడుతుంది. గుజరాత్‌ ప్రభుత్వంతో పాటు ప్రస్తుతం ఆరు ట్రస్టులు ఆశ్రమ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నాయి. సబర్మతి ఆశ్రమ్‌ పరిరక్షణ, మెమోరియల్‌ ట్రస్ట్‌ (ఎస్‌ఎపిఎంటి), గాంధీ స్మారక నిధి లు పిల్‌పై ప్రతిస్పందించాల్సి వుంది.

70 ఏళ్లుగా ట్రస్టుల పర్యవేక్షణలో ఉన్న ఆశ్రమం బాగానే  ఉందని, గతంలో ఎప్పుడూ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లలేదని తుషార్‌ గాంధీ పేర్కొన్నారు. ఇప్పుడెందుకు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూస్తుందని మండిపడ్డారు. సంరక్షణ కోసం అవసరమైన నిధులను పారిశ్రామిక వేత్తలు, ప్రైవేట్‌ వ్యక్తుల నుండి గాంధీ స్మారక నిధి సేకరిస్తోందని అన్నారు. ఈ కమిటీ నియామకంలోనూ ప్రభుత్వం పాలుపంచుకోలేదని అన్నారు. ప్రస్తుత ప్రాజెక్టులో కూడా వేర్వేరు నిర్మాణాల కోసం కేంద్రం నిధులను విడుదల చేస్తుందని .. ఈ నేపథ్యంలో ఆశ్రమంపై కేంద్రానికి ఎలాంటి హక్కులు ఉండవని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ.. ఆగస్టులో పలువురు ప్రముఖులు ఒక లేఖను కూడా రాశారని అన్నారు. ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది పర్యాటకులు ఆశ్రమాన్ని సందర్శిస్తుంటారని పేర్కొన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో, చరిత్రలో సబర్మతి ఆశ్రమం ప్రముఖంగా నిలిచిందని, చరిత్రను తిరగరాసే ప్రయత్నంలో భాగంగా మోడీ ప్రముఖ కట్టడాలను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల జలియన్‌వాలాబాగ్‌ పునరుద్ధరణపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. భావోద్వేగాలకు, బ్రిటీష్‌ వారి కర్కశానికి నిదర్శనంగా నిలిచిన జలియన్‌వాలాబాగ్‌ను పునరుద్ధరణ పేరుతో పూర్తిగా తుడిచిపెట్టారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.