
ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో
తూర్పునౌకాదళం ఈస్టర్న్ ఫ్లీట్ ఫ్లాగ్ ఆఫీసర్‌గా రియర్ అడ్మిరల్ సొబ్టి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకూ రియర్ అడ్మిరల్ సంజరు వాత్సయన ఈ బాధ్యతల్లో ఉన్నారు. నూతన బాధ్యతలు చేపట్టిన సొబ్టికి సంజరు వాత్సాయన ఆధ్వర్యాన గౌరవ వందనం అందించారు. తరుణ్ సొబ్టి ఇండియన్ నేవీలో 1988 జులైలో చేరారు. నేవిగేషన్ డైరెక్షన్లో ఈయన నిపుణులుగా ఉన్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఖడక్వాస్లా, ముంబయిలోని నేవల్ కాలేజీ ఆఫ్ వార్ఫేర్లో బాధ్యతల్లో పనిచేశారు. సంజరు వాత్సాయన గడచి 12 నెలల్లో ఈస్టర్న్ ఫ్లీట్‌ను యుద్ధ సన్నాహాలకు సంబంధించిన ఆపరేషన్స్‌లో నైపుణ్య శిక్షణలు ఇవ్వడంలో ప్రత్యేక కృషి చేసినట్లు తూర్పునౌకాదళం అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. సముద్రంలో ఆపరేషనల్ మిషన్స్, సాగర్ మిషన్, మానవతా దృక్పథంలో నావికాదళ సిబ్బందిని సిద్ధం చేయడంలో సంజరు వాత్సాయ కృషి చేశారు. నూతనంగా ఫ్లీట్ కమాండర్‌గా విచ్చేసిన సొబ్టికి ఘనంగా నౌకాదళంలో స్వాగతం లభించింది.