Nov 30,2020 21:14

వరిపంటను పరిశీలిస్తున్న ఆర్డీవో, తదితరులు

ప్రజాశక్తి విలేకరులు.... ధర్మవరం టౌన్‌: నివర్‌ తుఫాన్‌ కారణంగా దెబ్బతిన్న పంటలను ఆర్డీవో మధుసూదన్‌, ఎడిఎ కృష్ణయ్య సోమవారం పరిశీలించారు. మండల పరిధిలోని పోతులనాగేపల్లి గ్రామంలో నేలకొరిగిన వరి పంటలను వారు పరిశీలించారు ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి ఉన్నతాధికారులకు వెంటనే నివేదించాలని వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారి చెన్న వీరస్వామి, గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.
నంబులపూలకుంట : నివర్‌ తుపాను వల్ల నష్టపోయిన మండల కేంద్రంలోని పెద్ద చెరువు దగ్గర ఉన్న వరిపంటను జెడి రామక్రిష్ణ, ఎడిఎ సత్యనారాయణ సోమవారం పరిశీలించారు. మండల వ్యాప్తంగా జరిగిన పంటనష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంటనష్టం నివేదికను ప్రభుత్వానికి పంపి పరిహారం అందడానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విహెచ్‌ఎ యుగంధర్‌, విఎఎ ఇంతియాజ్‌, రైతులు ఆదినారాయణరెడ్డి, వెంకటరెడ్డి, రామిరెడ్డి, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.