Nov 27,2020 22:25

పొలాలను పరిశీలిస్తున్న మాజీ జడ్‌పిటిసి

ప్రజాశక్తి - ఆళ్లగడ్డ రూరల్‌: నివర్‌ తుఫానుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీ జడ్‌పిటిసి చాంద్‌ బాష కోరారు. శుక్రవారం తుఫానుతో నష్టపోయిన రైతుల పొలాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. మండలంలో వరి పంట చేతికొచ్చే సమయంలో వాలి పోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మండలంలో దాదాపు 2,500 ఎకరాల్లో పంట దెబ్బతినిందన్నారు. అలాగే మినుము పంట కూడా పూత దశలో ఉన్న సమయంలో పూలు రాలిపోవడంతో రైతులు నష్టపోయారన్నారు. ఎకరాకు సుమారు రూ.25 నుంచి 30 వేలు వెచ్చించి సాగు చేసిన వరి పంట కోతకు వచ్చిన దశలో అకాల వర్షం రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. బాధిత రైతులకు ఎకరాకు రూ.30 వేల చొప్పున ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టర్‌ నన్నే భై గారి జిలాన్‌, హుస్సేన్‌ వలీ, మహబూబ్‌ బాష, రసూల్‌, రజక నరసింహ పాల్గొన్నారు.
ఆళ్లగడ్డ : నివర్‌ తుఫాన్‌ తాకిడికి దెబ్బతిన్న రైతన్నలకు ఎకరాకు రూ.20 వేల నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్‌ నంద్యాల పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్‌ కోరారు. నియోజకవర్గంలోని బాచేపల్లె, ఆలమూరు, నరసాపురం గ్రామాల్లో పంట పొలాలను పరిశీలించి మాట్లాడారు. నంద్యాల పార్లమెంట్‌ పరిధిలో 30 వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిందని తెలిపారు. కాంగ్రెస్‌ యువ నాయకులు మన్సూర్‌, సురేంద్ర పాల్గొన్నారు.
మహానంది : నివర్‌ తుఫానుతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ (ఎంఎల్‌) రెడ్‌ స్టార్‌ పార్టీ జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్‌, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి డక్కా బాలు, ఎఐకెకెఎస్‌ నాయకులు కోరారు. శుక్రవారం గాజులపల్లె, బోయలకుంట్ల, నందిపల్లె, గోపవరం గ్రామాల్లో వారు పంట పొలాలను పరిశీలించారు.