Nov 20,2020 06:37

కళ్ళు మూసుకుపోయి
ఒళ్ళు తెలియక
గర్భంలోనే పిండాన్ని
చిదిమే కాముకులు.
సొమ్ము రెట్టింపు చేస్తామని
చెమట చుక్కల్ని
అత్తరుగా పూసుకొనే
కుచ్చుటోపీగాళ్ళు.
మందు, మద బలాలతో
డబ్బులు వెదజల్లి
దొడ్డిదారిన గద్దెనెక్కే
చేతకాని కుత్సితులు.
కోట్ల రూపాయలు
బ్యాంకులకు ఎగవేసి
విదేశాలలో జల్సా చేసే
పరమ దగుల్బాజీలు.
కన్నోళ్ళ కష్టాల్ని
సుఖాలుగా మలచుకొని
చివరకు వృద్ధాశ్రమాల
పాల్జేసే నీచ ప్రబుద్ధులు.
ప్రేమ పేరుతో వెంటపడి
వేధించి చివరకు
మనసెరుగక గొంతులు
కోస్తున్న కసాయిలు.
రసాయనాలతో
ఆహారాన్ని విషంజేసి
కొద్ది కొద్దిగా ప్రాణాలు
హరించే యమకింకరులు.
స్వార్థంతో విద్యా
వైద్యాన్ని వ్యాపారం చేసి
జనం బతుకులతో
చెలగాటమాడే జాదూగాళ్ళు.
తమ మతమే గొప్పదంటూ
లౌకికతత్వానికి
తూట్లు పొడుస్తున్న
ఛాందస మతోన్మాదులు.
ఎందెందు వెతికినా
అందందే..నయ(యా)
వంచన గా(గూ)ళ్ళు
సామాన్య ప్రజలారా!
తస్మాత్‌ జాగ్రత్త!!
                     - డా|| పెంకి విజయ కుమార్‌, సెల్‌ : 95533 92949