Jan 10,2021 19:41

మన పండగలు, సాంస్క ృతిక సంబరాలూ భిన్నత్వంలోని ఏకత్వానికి అద్దం పడతాయి. ఆయా కాలాలకు, ప్రాంతాలకు, ప్రజల ఆచార సాంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలుస్తాయి. కలిసి మెలసి బతికే మనుషుల తరతరాల బంధాలకు అర్థం చెబుతాయి. సంక్రాంతి రోజుల్లో కోనసీమలో కనిపించే ప్రభల తీర్థం .. నదీతీర ప్రాంత సందళ్లకు ఒక ఉదాహరణ. ఊళ్లకు ఊళ్లు సందోహంగా కదిలే సాంస్క ృతిక సంబరానికి ఆనవాలు.

మనకు అక్కడ ఏ ఆలయం కనపడదు. అయినా ఏదో ప్రముఖ సందర్శనా స్థలానికి వచ్చినట్లుగా జనం తండోపతండాలుగా తరలివస్తారు. కిలోమీటరు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని గ్రామాల ప్రజలంతా ఓ ఉత్సవంలా బయలుదేరి అక్కడికి చేరుకుంటారు. శతాబ్దాల తరబడి ఇదే కొనసాగుతోంది. కోనసీమలో ఊళ్లకు ఊళ్లు కలిసి చేసుకునే ఆ ఉత్సవమే 'ప్రభల ఉత్సవం'.

400 ఏళ్లకు పైగా నిర్వహిస్తూ వస్తున్న ఈ ప్రభల ఉత్సవం ఆ ప్రాంతంలో అందరి పండగ. కోనసీమలోని కొత్తపేట, జగ్గన్నతోట, వాకలగరువు, పల్లెపాలెం (ముమ్మడివరం మండలం), చెయ్యేరు (కాట్రేటికోన మండలం) ప్రభల ఉత్సవాలకు పెట్టింది పేరు. అయితే జగ్గన్న తీర్థం ప్రభల ఉత్సవానికి చాలా ప్రాముఖ్యం ఉంది. జగ్గన్న తీర్థానికి 11 గ్రామాల నుంచి ప్రభలు వచ్చి చేరుతాయి. మొసలపల్లి, పాలగుర్రు, ముక్కామల, లేదులూరు, ఇరుసుమండ, వ్యాఘ్రేశ్వరం, గంగలకుర్రు, పెదపూడి, గంగలకుర్తి అగ్రహారం, పుల్లేటికుర్తి, వక్కలంక గ్రామాల నుంచి వచ్చే ఈ ప్రభలకు 'ఏకాదశ రుద్రుల'ని పేరు. ఒక్క జగ్గన్న తీర్థం ప్రభల ఉత్సవానికే 50 వేల నుంచి లక్ష మంది వరకు సందర్శకులు వస్తారు. అంబాజీపేట మండలం మొసలపల్లి నుంచి మొదటిప్రభ ముందుగా సందర్శనా స్థలానికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ మరుసటి రోజు కనుమ నాడు ఈ ఉత్సవం నిర్వహిస్తారు.

పభల తయారీ
ప్రకృతి సహజసిద్ధ వస్తువులతోనే ఈ ప్రభలను తయారు చేస్తారు. ముందుగా వెదురుకర్రలతో ఒక ఆర్చీని తయారు చేస్తారు. దానికి రంగురంగుల కొత్త, పాత వస్త్రాలను చుట్టి అలంకరణ చేస్తారు. ఈ ఆర్చీ తయారీలో కొంతమందే భాగస్వామ్యమైనా, వస్త్రాల అలంకరణలో మాత్రం గ్రామస్తులందరూ పాలు పంచుకుంటారు.

ఏళ్లతరబడి ఆ మార్గం గుండానే..
గంగలకుర్రు అగ్రహారం నుంచి బయలుదేరే ప్రభను గోదావరి పాయ 'కౌశికి' గుండా తీసుకు వస్తారు. ఆ మార్గంలో నది నీరు ప్రవహిస్తూ ఉంటుంది. నడుంకు పైగా నీరు ప్రవహిస్తున్నా ఆ దారిలోనే ప్రభను తీసుకువస్తారు. ఆ దృశ్యాన్ని చూసేందుకే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివస్తారు. రహదారి మార్గం గుండా తీర్థానికి చేరుకోవచ్చు. అయినా పూర్వికులు తెచ్చిన తోవలోనే ఇప్పటికీ తేవడం ఓ ఆచారంలా భావిస్తారు ఆ గ్రామప్రజలు. తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచే కాక సింగపూర్‌, మలేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లో స్థిరపడ్డ గోదావరి వాసులు కూడా ప్రతి ఏడాది ఈ ప్రభల ఉత్సవానికి వస్తుంటారు.

ప్రభల ఉత్సవానికి పెట్టింది పేరు : దంతులూరి సతీష్‌రాజు, మొసలపల్లి ఉత్సవ కమిటీ సభ్యుడు.
మా గ్రామం ప్రభల ఉత్సవానికి పెట్టింది పేరు. ఇక్కడి నుంచి బయలుదేరే ప్రభను చూడడానికి వేలసంఖ్యలో ప్రజలు వస్తారు. ప్రతి ఏడాది జనవరి 10 నుంచి ప్రభల తయారీ మొదలవుతుంది. సిద్ధమైన ప్రభను కనుమ రోజు ఉదయం 10 గంటలకల్లా జగ్గన్న తీర్థానికి చేరుస్తాం. ప్రభల తయారీలో కులమతాలకతీతంగా గ్రామస్తులంతా భాగస్వాములు కావడం వందల సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తోంది.

జగ్గన్న తీర్థానికి ఎంతో విశిష్టత : పులిపాక సత్యనారాయణ శాస్త్రి, ఐదోతరం అర్చకులు, మొసలపల్లి.
మా జగ్గన్న తీర్థానికి ఎంతో విశిష్టత ఉంది. ఇక్కడికి వచ్చే ప్రభలను చూడటానికి లక్షలాది మంది వస్తారు. వందల ఏళ్ల నాడు ఏవిధంగా, ఏ మార్గం గుండా ప్రయాణించి వచ్చాయో అదే మార్గం గుండా ప్రభలను తీసుకురావడం ఈ ఉత్సవ ప్రత్యేకత. స్వయంగా భుజాల మీద మోసుకొస్తూ కిలోమీటర్ల కొద్దీ ప్రయాణిస్తుంటారు. 70 నుంచి 80 మంది ప్రభలను మోస్తూ వస్తుంటే మిగిలిన గ్రామస్తులు వారి వెంట కాలినడకన ఈ తీర్థానికి చేరుకుంటారు.