Nov 27,2020 21:27

వాషింగ్టన్‌ : అమెరికా ఎన్నికల ఫలితాన్ని పక్కకు నెట్టివేయడానికి జరిగే ప్రయత్నాలకు అమెరికన్లు బాసటగా నిలబడరని అధ్యక్షుడుగా ఎన్నికైన జో బైడెన్‌ బుధవారం వ్యాఖ్యానించారు. థేంక్స్‌గివింగ్‌ శలవు సందర్భంగా తన స్వస్థలంలో బైడెన్‌ ప్రసంగిస్తూ పూర్తి స్వేచ్ఛ, పారదర్శకమైన వాతావరణంలో ఎన్నికలు జరిగాయని, ఆ ఫలితాలను మనం గౌరవించాలని అన్నారు. ఈ దేశ ప్రజలు, చట్టాలు ఏవీ కూడా ఇతర ప్రయత్నాలకు బాసటగా నిలబడవని అన్నారు. గత మూడు వారాలకు పైగా ఎన్నికల ఫలితాలపై పదే పదే ట్రంప్‌ ఆరోపణలు చేస్తూ వచ్చిన నేపథ్యంలో బైడెన్‌ ప్రకటన వెలువడింది. ఈ ఎన్నికల్లో పరాజయం పాలైన ట్రంప్‌ 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడంపై కన్నేశారని ఆయన మద్దతుదారులు కొంతమంది పేర్కొంటున్నారు.