Nov 22,2020 18:19

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని , నిబంధనలకనుగుణంగా లేని ఓట్లను తిరస్కరించాలని కోరుతూ ట్రంప్‌ బృందం వేసిన దావాను పెన్సిల్వేనియా జిల్లా కోర్టు తోసిపుచ్చింది. ట్రంప్‌ బృందం ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. ఫలితాలను అధికారికంగా ధ్రువీకరించవచ్చని పెన్సిల్వేనియా అధికారులకు సూచించింది. ఓట్లు చెల్లవనడానికి సరైన ఆధారాలు లేవని, కేవలం ఊహాజనిత ఆలోచనలతోనే ట్రంప్‌ బృందం ఒత్తిడి తెస్తోందని పెన్సిల్వేనియా కోర్టు న్యాయవాది మ్యాథ్యూ బ్రాన్‌ స్పష్టం చేశారు. ఈ తీర్పు పట్ల ట్రంప్‌ బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆధారాలను చూపేందుకు సమయం ఇవ్వకుండానే తమ విన్నపాన్ని కొట్టివేయడం దురదృష్టకరమని పేర్కొంది. తీర్పు త్వరగా చెప్పడం వల్ల సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు మార్గం సుగమైందని అభిప్రాయపడింది. ఇక, 20 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్న పెన్సిల్వేనియాలో జో బైడెన్‌ 81వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ ఓటర్లు ఎన్నికల నిబంధనలు పాటించలేదని, లక్షల సంఖ్యలో పోలైన ఓట్లను రద్దు చేయాలని ట్రంప్‌ బృందం వాదన. కోర్టును ఆశ్రయించగా తాజాగా పై తీర్పును వెలువరించింది. ఇంకా ఓటమిని అంగీకరించని ట్రంప్‌ న్యాయపరంగా పోరాడుతూనే ఉన్నారు. మరోవైపు అధికార బదిలీకి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు వివాదం కొనసాగుతున్నప్పటికీ అధ్యక్ష మార్పిడి చట్టం(ప్రెసిడెన్షియల్‌ ట్రాన్సషన్‌) ప్రకారం ప్రక్రియను మొదలు పెట్టినట్లు వైట్‌హౌస్‌ అధికారులు వెల్లడించారు.