Feb 11,2021 13:47

వాషింగ్టన్‌ : అమెరికా మాజీ అధ్యక్షడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్విట్టర్‌ ఖాతాను శాశ్వతంగా నిలిపివేసినట్లు ప్రముఖ సామాజిక సంస్థ వెల్లడించింది. ఆయన అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినా కూడా ఖాతాను పునరుద్ధరించమని చీఫ్‌ ఫైనాన్సియల్‌ ఆఫీసర్‌ నెడ్‌ సెగాల్‌ తెలిపారు. గత నెల 6న క్యాపిటల్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదారులు హింసాత్మక దాడికి పాల్పడిన అనంతరం ట్విట్టర్‌ ఖాతాను శాశ్వతంగా నిలిపివేయగా.. పలు సోషల్‌ మీడియా సంస్థలు తాత్కాలిక నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రజలు రెచ్చగొట్టేలా ప్రేరేపించే ఎవరినైనా..తమ వేదిక నుండి తొలగించడమే కాకుండా..తిరిగి రానివ్వబోమని ట్విట్టర్‌ చీఫ్‌ ఫైనాన్సియల్‌ ఆఫీసర్‌ నెడ్‌ సెగాల్‌ వెల్లడించారు. తమ సంస్థ నుంచి ఒకసారి ఒకరిని తొలగించామంటే దాని అర్ధం పూర్తిగా తొలగించటం కిందకు వస్తుందని, అది ఓ విమర్శకుడైనా, ఏదైనా కంపెనీ సిఎఫ్‌ఒ అయినా, ప్రస్తుతం లేదా ఇదివరకు ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి అయినా తమ సంస్థ నియమాలు ఒకే విధంగా ఉంటాయని అని ట్విటర్‌ నెడ్‌ సెగాల్‌ స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో ట్రంప్‌ పోటీ చేసి మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినా కూడా.. ట్రంప్‌ను ట్విటర్‌లోకి మళ్లీ అనుమతించేది లేదని ఆయన తెలిపారు.