Jan 14,2021 09:20

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తర్వాత ట్రంప్‌ కీర్తి రోజురోజుకూ మసకబారుతోంది. తన అనాలోచిత నిర్ణయాలతో ట్రంప్‌ తన పేరును తానే చెడగొట్టుకుంటున్నారు. ఇటీవల జరుగుతోన్న పరిణామాలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణలుగా చెప్పొచ్చు. దీంతో ట్రంప్‌ చివరి రోజులు అత్యంత అవమానకరంగా ముగిశాయి. మరో వారం రోజుల్లో అధ్యక్షపీఠం నుంచి దిగిపోనున్న వేళ అభిశంసనకు గురై రెండోసారి అభిశంసనకు గురైన తొలి అధ్యక్షుడిగా అమెరికా చరిత్రలో నిలిచిపోయారు.

ట్రంప్‌ను అధికారం నుంచి తొలగించేందుకు ఉద్దేశించిన 25వ సవరణను ప్రతిపాదించాలని ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ను కోరుతూ ఓ తీర్మానాన్ని ప్రతినిధుల సభ ఆమోదించింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 232 ఓట్లు, వ్యతిరేకంగా 197 ఓట్లు పడ్డాయి. ట్రంప్‌నకు ఉద్వాసన పలకడానికి ఈ సవరణను ఉపయోగించేందుకు కేబినెట్‌ను సమీకరించాలని పెన్స్‌ను ఇందులో కోరారు. ఈ ఓటింగ్‌లో ట్రంప్‌ సొంత పార్టీకి చెందిన 10 మంది సభ్యులు అభిశంసన తీర్మానానికి మద్దతు తెలిపారు. నలుగురు కాంగ్రెస్‌ సభ్యులు గైర్హాజరయ్యారు. నలుగురు ఇండో అమెరికన్‌ సభ్యులు అభిశంసనకు మద్దతు తెలుపుతూ ఓటేశారు.

ట్రంప్‌ ఇంతటి అవమానాన్ని ఎదుర్కోవడానికి కారణం కేపిటల్‌ భవనంపై ఆయన మద్దతుదారుల దాడి ఘటనే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌ గెలుపును నిర్ధారించేందుకు ఈ నెల 6న సమావేశమైన కేపిటల్‌ హిల్‌ భవనాన్ని చుట్టుముట్టిన ట్రంప్‌ మద్దతుదారులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు దీనిని అడ్డుకునే క్రమంలో హింసాత్మకంగా మారింది. నిరసనకారుల్లో నలుగురు చనిపోగా.. ఓ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో 25వ రాజ్యాంగ సవరణను ఉపయోగించి ట్రంప్‌ను పదవి నుంచి తొలగించాలని ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ను కోరుతూ డెమొక్రాట్లు ప్రతినిధుల సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ట్రంప్‌ కావాలనే తన మద్దతుదారులను ప్రోత్సహించారంటూ ఆయనపై ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే, 25వ రాజ్యాంగ సవరణ చట్టం కింద ఉపాధ్యక్షుడు, కేబినెట్‌లోని మెజారిటీ సభ్యులు తీర్మానించడం ద్వారా అధ్యక్షుడిని తొలగించే వీలుంది. సోమవారమే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టనా, రిపబ్లిక్‌ సభ్యులు అడ్డుకున్నారు. 25వ సవరణ అధికారాన్ని ఉపయోగించేందుకు తాను సుముఖంగా లేనంటూ పెన్స్‌ ఇదివరకే సంకేతాలిచ్చారు. స్పీకర్‌ పెలోసీ పట్టుబట్టి మరీ ఈ తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించారు. మైక్‌ పెన్స్‌ దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. మెజారిటీ సభ్యులు మద్దతు పలకడంతో ట్రంప్‌ అభిశంసనకు గురయ్యారు. ఈ తీర్మానాన్ని సెనెట్‌కు పంపనున్నారు. కాగా, ఈ నెల 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్‌ అధ్యక్ష బాధ్యతలు చేపడతారు. సెనెట్‌ ఈనెల 19 వరకు వాయిదా పడటంతో బైడెన్‌ బాధ్యతల స్వీరారం అనంతరం ట్రంప్‌పై విచారణ జరగనుంది.