Sep 14,2021 22:01

* గంట ముందే సిఆర్‌పిఎఫ్‌ బలగాల ఉపసంహరణ : జితిన్‌ చౌదరి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : త్రిపురలో భారత రాజ్యాంగం పని చేయటం లేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం ప్రాంతాల్లో ప్రతిపక్షాలు నామిషన్లు వేసేందుకు అనుమతించలేదని మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత మాణిక్‌ సర్కార్‌ విమర్శించారు. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో హోల్‌సేల్‌ రిగ్గింగ్‌ జరిగిందని, 1952 తరువాత 2019లోనే ఒక నియోజకవర్గంలోనే అత్యధిక కేంద్రాల్లో రీ పోలింగ్‌కు ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు. ఆ ఎన్నికలను కౌంటర్‌ చేశామని, తమ మాట ఎన్నికల సంఘం వినిపించుకోలేదని అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యాలయం, సిపిఎం మద్దతుదారులపై దాడులను మీడియా విస్తృతంగా నివేదించినప్పటికీ ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌ షా మౌనంగా ఉండటం దారుణమన్నారు. ఇది త్రిపురలో జరుగుతున్న దాడులకు కేంద్ర ప్రభుత్వం మద్దతుగా ఉందని సూచిస్తుందన్నారు.

(Read also: త్రిపురలో దాడులు ఆపాలి : సీతారాం ఏచూరి)

ఎమ్మెల్యేలను నియోజకవర్గాల్లోకి అనుమతించటం లేదు
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పార్లమెంట్‌లోనూ, వెలుపల ప్రతిపక్షాల పాత్ర చాలా కీలకమైనదని, కానీ త్రిపురలో ప్రతిపక్షాలపై దాడి చేస్తున్నారని, అందులో సిపిఎంపైన ఫోకస్‌ చేసి దాడులకు ఒడిగడుతున్నారని విమర్శించారు. ఇతర వామపక్ష పార్టీలు, కాంగ్రెస్‌పైన కూడా దాడులు జరుగుతున్నాయని అన్నారు. ప్రజాస్వామ్య కార్యక్రమాలను అనుమతించటం లేదని పేర్కొన్నారు. తనతో సహా మెజార్టీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తమ నియోజకవర్గాలకు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లనీయటం లేదని విమర్శించారు. తాను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సందర్శనకు వెళ్లిన సందర్భాల్లో దాడులకు ప్రయత్నించారని తెలిపారు. ముగ్గురు సిపిఎం ఎమ్మెల్యేలపై భౌతిక దాడులు చేశారని తెలిపారు.

జర్నలిస్టులు, న్యాయవాదులపైనా దాడి
గత ఏడాదిన్నరగా కరోనా సమయంలో 35 మందికి పైగా జర్నలిస్టులు భౌతిక దాడికి గురయ్యారని, ఐదు ఎలక్ట్రానిక్‌ మీడియా సంస్థలపై దాడి చేశారని తెలిపారు. ఇటీవల తమ పార్టీ కార్యాలయాలతోపాటు 4 మీడియా సంస్థలపైనా దాడి చేశారని వివరించారు. మీడియాను అనుమతించటం లేదని అన్నారు. న్యాయవాదులపై కూడా దాడి జరుగుతుందని, ప్రభుత్వ వేధింపులకు గురైన ప్రజల పక్షాన ఉన్న న్యాయవాదుల ఇళ్లపై కూడా దాడి చేసి దోచుకుంటున్నారని విమర్శించారు. ఇటీవల ఇద్దరు న్యాయవాదులపై భౌతిక దాడి జరిగిందని, రాష్ట్రంలో మానవ హక్కులు లేవని అన్నారు.

హామీల అమలులో విఫలం.. ప్రజల్లో పెరిగిన అసంతృప్తి
రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి కారణంగా ప్రతిపక్షాలపైన దాడులు తీవ్రమయ్యాయని విమర్శించారు. త్రిపురలో సిపిఎం, వామపక్షాలకు పెరుగుతున్న ప్రజల మద్దతు బిజెపిని నిరాశకు గురిచేసిందని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా విస్మరించారని అన్నారు. నిరుద్యోగ యువతను, ఉపాధ్యాయులను, గ్రామీణ, పట్టణ పేదలను మోసం చేశారని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమ పథకాలను నాశనం చేసిందని, లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ గిరిజన అనుకూల విధానాలను కూడా ఇప్పుడు నిర్వీర్యం చేసిందని అన్నారు. ఫలితంగా త్రిపురలో ఆకలి చావులు, ఆకలి పెరిగిందని, నిరుద్యోగం పెరిగిందని, నేరస్థులకు లైసెన్స్‌ ఇవ్వబడిందని, మరోవైపు ద్వేషం, విభజన విత్తనాలను నాటడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ బిజీగా ప్రణాళికలు రూపొందిస్తుందని విమర్శించారు. ప్రజల జీవనోపాధిపై వామపక్షాలతో కలిసి సిపిఎం ప్రజలను సమీకరిస్తుందని, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తున్నామని అన్నారు. ఇది త్రిపుర ప్రజల సమస్య మాత్రమే కాదని, దేశంలోని ప్రజాస్వామ్య, లౌకిక ప్రజల సమస్య అని తెలిపారు. ఈ ఫాసిస్ట్‌ దాడులను ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.

దాడికి గంట ముందే సిఆర్‌పిఎఫ్‌ బలగాల ఉపసంహరణ : జితిన్‌ చౌదరి
మాజీ ఎంపి జితిన్‌ చౌదరి మాట్లాడుతూ తమ పార్టీ కార్యాలయం వద్ద ఉన్న సిఆర్‌పిఎఫ్‌ బలగాలను బిజెపి గూండాల దాడికి గంట ముందు రహస్యంగా ఉపసంహరించుకున్నారని అన్నారు. సిపిఎం మద్దతుదారుల దుకాణాలు దహనం చేశారని, కొల్లగొట్టారని వివరించారు. అనేక మంది కార్యకర్తలు భౌతిక దాడికి గురయ్యారని తెలిపారు. వీరిలో పది మందిని తక్షణమే ఆసుపత్రికి తరలించారని వివరించారు. సిపిఎం కార్యకర్తలు, మద్దతుదారులపై పోలీసులు తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేశారని అన్నారు. ఇళ్లు, పార్టీ కార్యాలయాలపై దాడులకు సంబంధించి పోలీసులకు ఫోన్‌ చేస్తే, స్పందించనే లేదని తెలిపారు. సెప్టెంబర్‌ 7, 8 తేదీల్లో 42 సిపిఎం, 1 ఆర్‌ఎస్‌పి, 1 సిపిఐఎంఎల్‌ కార్యాలయాలపై దాడి చేసి, దగ్ధం చేశారని అన్నారు. పార్టీ ఆస్తులు ధ్వంసం చేశారని, సిపిఎం రాష్ట్ర కార్యాలయంలోకి గూండాలు ప్రవేశించి నిప్పు పెట్టారని తెలిపారు. సిపిఎం మద్దతుదారులకు చెందిన 67 ఇళ్లు, దుకాణాలు ధ్వంసం చేసి, దోచుకున్నారని అన్నారు.

మాజీ ముఖ్యమంత్రినే సొంత నియోజకవర్గానికి వెళ్లనియ్యటం లేదు
ఈ నెల 6న ప్రతిపక్ష నేత, నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మాణిక్‌ సర్కార్‌ను తన సొంత నియోజకవర్గాన్ని సందర్శించకుండా పోలీసులు అడ్డుకున్నారని విమర్శించారు. అంతకుముందు శాంతి బజార్‌లో ఇతర సిపిఎం ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో కలిసి ఆయన ప్రయాణిస్తున్న వాహన శ్రేణిపై భౌతికంగా దాడి చేసినప్పుడు పోలీసులు చూస్తూ ఉండిపోయారని దుయ్యబట్టారు. మార్చి 2018 నుంచి జూన్‌ 2021 వరకు 662 పార్టీ కార్యాలయాలు, 204 ప్రజా సంఘాల కార్యాలయాలు, 3,363 సిపిఎం సభ్యులు, మద్దతుదారుల ఇళ్లు, 659 దుకాణాలు ధ్వంసం చేసి, దోచుకున్నారని చెప్పారు. చేపల చెరువులు, రబ్బరు చెట్లు వంటి 1,500 జీవనోపాధి కేంద్రాలు ధ్వంసం చేశారన్నారు. మహిళలపై అనాగరిక నేరాలు పెరుగుతున్నాయని అన్నారు. త్రిపురలో సిపిఎం, వామపక్షాలు, ఇతర ప్రతిపక్షాలపైన, స్వతంత్ర మీడియాపైన జరుగుతున్న దాడిని దేశంలోని ప్రజాస్వామ్య భావాలు కలిగిన వ్యక్తులు, రాజకీయ పార్టీలు ఖండించాలని కోరారు.

Read also: త్రిపురలో దాడులు ఆపాలి : సీతారాం ఏచూరి