Sep 14,2021 21:55

* దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి
* సిపిఎం కార్యాలయాలపై పథకం ప్రకారమే దౌర్జన్యాలు
* వాస్తవాలను నివేదించే మీడియా సంస్థలపైనా దాడి
* పాత్రికేయుల సమావేశంలో సీతారాం ఏచూరి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : త్రిపురలో సిపిఎం కార్యాలయాలపైన, కార్యకర్తలు, నాయకులపైన, సిపిఎం మద్దతుదారుల ఇళ్లపైన, వారి ఆస్తులపైన దాడులు ఆపాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్‌ చేశారు. మంగళవారం నాడిక్కడ సిపిఎం కేంద్ర కార్యాలయం (ఎకెజి భవన్‌)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో త్రిపుర మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత మాణిక్‌ సర్కార్‌, మాజీ ఎంపి జితిన్‌ చౌదరిలతో కలిసి ఏచూరి మాట్లాడారు. త్రిపురలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో నెలకొన్న కోపం, నిరాశ నేపథ్యంలో సిపిఎం, లెఫ్ట్‌ ఫ్రంట్‌ చేపడుతున్న ఉద్యమాలను దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రతిపక్ష కార్యకలాపాలను అణచివేయాలని బిజెపి తీవ్రమైన బీభత్సం, బెదిరింపులు సాగిస్తుందని విమర్శించారు. సిపిఎం, వామపక్షాలతో సహా ప్రతిపక్ష కార్యాలయాలపైన, కార్యకర్తలపైన దాడులకు ఒడిగట్టారని విమర్శించారు. వాస్తవాలను నివేదించే మీడియా సంస్థలపై కూడా దాడి చేశారని అన్నారు. ఉద్దేశపూర్వకంగా, ప్రణాళిక బద్ధంగా దాడులు చేశారని తెలిపారు. ఇది భారత రాజ్యాంగం ప్రజలకు హామీ ఇచ్చిన ప్రజాస్వామ్య హక్కులు, మానవ హక్కుల ఉల్లంఘన అని పేర్కొన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పనిచేసే నిబంధనలన్నీ బిజెపి ప్రభుత్వ నాయకత్వంలో త్రిపురలో నిలిపివేయబడ్డాయని తెలిపారు. ఇదే బిజెపి వాస్తవ ప్రవర్తన అని వివరించారు. గత మూడేళ్లలో పాలన అసంబద్ధంగా ఉందని, ఎన్నికలకు ముందు బిజెపి చాలా వాగ్ధానాలు ఇచ్చిందని, వాటిని అమలు చేయలేదని పేర్కొన్నారు.

(Read also: త్రిపురలో రాజ్యాంగం పని చేయటం లేదు : మాణిక్‌ సర్కార్‌)

ముఖ్యమంత్రే రెచ్చ గొట్టే వ్యాఖ్యలు
రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయని, ఈ ఉద్యమాల్లో సిపిఎం, వామపక్షాలు ముందున్నాయని ఏచూరి తెలిపారు. ప్రజా ఉద్యమాలను అనుమతించటం లేదని, అందులో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయని, ఈ బీభత్సం, హింసకు ఇదే కారణమని స్పష్టం చేశారు. సిపిఎంపై దాడులను సమర్థిస్తూ ముఖ్యమంత్రి స్వయంగా రెచ్చగొట్టే, బెదిరింపులతో కూడిన ప్రకటనలు చేశారని, ఆయన పూర్తి అబద్ధాలు మాట్లాడటం శోచనీయమన్నారు. 2018లో బిజెపి అధికారం చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక మహిళా సిపిఎం కార్యకర్తతో సహా 21 మంది సిపిఎం సభ్యులు, మద్దతుదారులు హత్యకు గురయ్యారని వివరించారు.

(Read also: త్రిపురలో రాజ్యాంగం పని చేయటం లేదు : మాణిక్‌ సర్కార్‌)

జై శ్రీరామ్‌ నినాదాలతో బిజెపి గూండాల దాడి
ఈ నెల 7, 8 తేదీల్లో జరిగిన అనేక దాడుల్లో బిజెపి గూండాలు జై శ్రీ రామ్‌ అని నినాదాలు చేస్తూ ఇనుప రాడ్‌లు, పెట్రోల్‌ బాంబులతో హింసను సృష్టించారన్నారు. పోలీసులు నిలబడి ఉన్నారని, కానీ వారు దాడులను ఆపలేదని అన్నారు. వారికి రక్షణగా ఉండి, పూర్తిగా బిజెపి ఏజెంట్లుగా మారారని ధ్వజమెత్తారు. త్రిపురలో దాడులన్నింటినీ వివరిస్తూ చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశానని, కానీ ఆయన కనీసం స్పందించలేదని అన్నారు. ఏదైనా బిజెపియేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రంలో చిన్న ఘటనలకే మొత్తం కేంద్ర ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్‌ స్పందిస్తుందని, హడావుడి చేస్తుందని విమర్శించారు.

త్రిపుర ప్రజా పోరాట వారసత్వం బిజెపికి లేదు
ప్రముఖ గిరిజన నాయకుడు, గణ ముక్త పరిషత్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి దశరథ్‌ దేవ్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఏచూరి చెప్పారు. దేవ్‌ రాజాలకు వ్యతిరేకంగా పోరాడి, త్రిపురను భారతదేశంలో భాగం చేయడానికి కృషి చేశారని తెలిపారు. ఆ చారిత్రక వారసత్వం కలిగిన నేతల విగ్రహాలు ఉండటం కూడా బిజెపి నాయకులు సహించలేకపోతున్నారని, ఎందుకంటే బిజెపికి త్రిపుర ప్రజా పోరాట వారసత్వం లేదని తెలిపారు. ఇది రాజకీయ సవాలని అన్నారు. హింస, బీభత్సం మంచిది కాదని, ఈ సవాలును తిప్పికొడతామని, త్రిపుర ప్రజలు ఈ దాడులను ఎదుర్కొంటారని అన్నారు.

తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలి
ఈ పరిస్థితుల్లో వీడియోల్లో గుర్తించిన అందరిపై చర్యలు తీసుకోవాలని, దాడుల్లో గాయాల పాలైన వారికి, ఇళ్లు, దుకాణాలు, ఇతర ఆస్తి కోల్పోయిన వారికి వెంటనే పరిహారం ఇవ్వాలని, సిపిఎం, వామపక్షాలు, ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలపై బనాయించిన తప్పుడు కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం, వామపక్షాలు, అన్ని ప్రతిపక్ష పార్టీలపై దాడులు, హింసను ఆపాలని డిమాండ్‌ చేశారు. మీడియాపై దాడులు ఆపాలని, వాటిని స్వేచ్ఛగా పనిచేయడానికి అనుమతించాలని కోరారు. బాధ్యులైన దుర్మార్గులను అరెస్టు చేయాలని, విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

Read also: త్రిపురలో రాజ్యాంగం పని చేయటం లేదు : మాణిక్‌ సర్కార్‌