Nov 26,2021 07:43

* బూత్‌ల స్వాధీనం, ఓటర్లను అడ్డుకున్న పాలక పార్టీ
* నిరసించిన సిపిఎం
అగర్తలా :
త్రిపుర మున్సిపల్‌ ఎన్నికల్లో బిజెపి అరాచకాన్ని సృష్టించింది. అగర్తలాలో, రాష్ట్రంలో పలుచోట్ల బిజెపి గూండాలు పెద్ద్ద ఎత్తున హింసాకాండకు, బూత్‌ల స్వాధీనానికి పాల్పడ్డారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనివ్వ కుండా అడ్డుపడ్డారు. దీన్ని సిపిఎం తీవ్రంగా నిరసించింది. స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలు జరిగేలా చూడాలని డిమాండ్‌ చేస్తూ అగర్తలా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌ వెలుపల సిపిఎం భారీ నిరసన చేపట్టింది. 17వ వార్డు సిపిఎం అభ్యర్ధి రిక్తా దాస్‌ వైద్య బెలోనియా సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ కార్యాలయానికి వచ్చి నిరసన తెలియజేశారు. ఉదయం పోలింగ్‌ ప్రారంభమైన వెంటనే అగర్తలాలోని పలు వార్డుల్లో బిజెపి గూండాలు దాడులు చేశారని టిఎంసి ఆరోపించింది. దక్షిణ త్రిపుర జిల్లాలో పాలక పార్టీ ఓటర్లను అడ్డుకుంటోందని, స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వకుండా పార్టీ కార్యకర్తలను అడ్డుకుంటున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జితేన్‌ చౌదరి విమర్శించారు. బిజెపి ప్రతినిధి నబేందు భట్టాచార్య గురువారం మాట్లాడుతూ, ఉత్సాహభరితమైన వాతావరణంలో పోలింగ్‌ జరిగిందంటూ చెప్పుకొచ్చారు. ఎన్నికలకు ముందు కూడా హింస, అరెస్టులు, ఢిల్లీలో ధర్నాలు, శాంతియుతంగా పోలింగ్‌ జరిగేలా చూడాలంటూ సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని అధికారులను కోరడం జరిగింది.