Sep 15,2021 21:10

న్యూఢిల్లీ : ట్రిబ్యునళ్ళ నియామకాలకు సంబంధించి కేంద్రం అనుసరించిన వైఖరిని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో వున్న ఖాళీల వల్ల ఈ ట్రిబ్యునళ్లు దాదాపు పని చేయకుండా పోయాయని పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావుతో కూడిన ప్రత్యేక బెంచ్‌, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు ధిక్కార చర్యలు చేపట్టడంపై దృష్టి పెట్టింది. అన్ని ట్రిబ్యునళ్లకు నియామకాలను జరపడానికి రెండు వారాల సమయాన్ని ఇచ్చింది. ఒకవేళ ఈ గడువులోగా ప్రభుత్వం చర్యలు తీసుకోని పక్షంలో తామే ఆదేశాలు జారీ చేస్తామని జస్టిస్‌ రమణ పేర్కొన్నారు. ట్రిబ్యునళ్ల స్థితిగతులను, వేలాదిమంది కక్షిదారులు న్యాయం కోసం ఎదురుచూడడాన్ని 'అత్యంత దయనీయమైన స్థితి' గా ఆయన వ్యాఖ్యానించారు. నెలల తరబడి కేసులు వాయిదాలు పడుతున్నాయన్నారు. బెంచ్‌లను ఏర్పాటు చేయడానికి తగినంతమంది లేరు, తమ కేసులను విచారించడానికి కనీసం కొంతమంది ట్రిబ్యునల్‌ సభ్యులైనా అందుబాటులో వున్న ఇతర రాష్ట్రాలకు సైతం కక్షిదారులు ప్రయాణాలు చేయాల్సి వస్తోందని అన్నారు. ట్రిబ్యునళ్లకు అనువైన అభ్యర్థుల కోసం దేశమంతా తిరిగి ఇంటర్వ్యూలు చేసి ఎంపిక చేసే బాధ్యతను సుప్రీంకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తుల నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీలు చేపట్టాయి. కరోనా సమయంలో కూడా వారు దేశమంతా తిరిగి 534మంది జ్యుడీషియల్‌ సభ్యులను, 400మందికి పైగా టెక్నికల్‌ సభ్యులను ఇంటర్వ్యూ చేసి ఒక జాబితా రూపొందించారు. వారు అంత కష్టపడి పనిచేస్తే ప్రభుత్వం ఇలా వ్యవహరించడాన్ని బెంచ్‌ ప్రశ్నించింది. కమిటీ రూపొందించిన తుది ఎంపిక జాబితా నుండి ప్రభుత్వం కొద్ది పేర్లను మాత్రమే ఎంచుకుని, వెయిటింగ్‌ జాబితాలో వున్న వారి నుండి మరికొన్ని పేర్లను తీసుకోవడాన్ని జస్టిస్‌ రమణ తప్పుబట్టారు. 'నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ సెలక్షన్‌ జాబితాను నిన్న చూశాను. 9మంది జ్యుడీషియల్‌ సభ్యులను, 10మంది సాంకేతిక సభ్యులను సెలక్షన్‌ కమిటీ సిఫార్సు చేసింది. కానీ అప్పాయింట్‌మెంట్‌ లేఖలు చూసినట్లైతే, సెలక్ట్‌ జాబితా నుండి కేవలం మూడు పేర్లను మాత్రమే తీసుకున్నట్లు తెలుస్తోంది. మిగిలిన వారిని వెయిటింగ్‌ జాబితా నుండి తీసుకున్నారు. సెలక్ట్‌ జాబితాలోని ఇతరులను పూర్తిగా విస్మరించారు. సర్వీస్‌ చట్ట నిబంధనల ప్రకారం, సెలక్ట్‌ జాబితాను విస్మరించి, వెయిటింగ్‌ జాబితాలోకి మీరు వెళ్లరాదు. ఇది ఏ రకమైన నియామకం?' అని ప్రధాన న్యాయమూర్తి రమణ అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ను ప్రశ్నించారు. ఎవరినైనా ఒకరిని ఎంపిక చేసే అధికారం ప్రభుత్వానికి లేదా అని అటార్నీ జనరల్‌ ప్రశ్నించారు. చట్టబద్ధ పాలన గల ప్రజాస్వామ్య దేశంలో నియమాకాలకు హామీ లేనప్పుడు ఇక ఈ కమిటీలు ఏర్పాటు చేసి ప్రయోజనమేమిటని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. చిట్టచివరి మాట, చర్య ప్రభుత్వానిదే అయినపుడు ఇక సెలక్షన్‌ కమిటీ ఎంపిక క్రమం ప్రయోజనమేమిటని ప్రశ్నించారు. రుణాలు రికవరీ చేసే ట్రిబ్యునళ్లలో ఖాళీలు భర్తీ కాకపోవడంతో దాదాపు అవి పనిచేయకుండా పోయాయని జస్టిస్‌ చంద్రచూడ్‌ పేర్కొన్నారు. ఇల్లు లేదా ఫ్యాక్టరీపై గల రుణాన్ని రికవరీ చేయాలని బ్యాంక్‌ నిర్ణయించినపుడు ఇక రుణ గ్రహీతకు పరిష్కారమనేది లేకుండా పోతుందని అన్నారు. ఆ కేసును విచారించడానికి హైకోర్టు తిరస్కరిస్తే ఇక న్యాయం జరిగే అవకాశమే లేదని చెప్పారు.