Nov 21,2020 21:19

 శ్రీకాకుళం ప్రతినిధి: ట్రైమెక్స్‌ ఇండిస్టీస్‌ లిమిటెడ్‌ విషయంలో గతంలో టిడిపి ప్రభుత్వం, ప్రస్తుత వైసిపి ప్రభుత్వం వల్లమాలిన ప్రేమను కనబరుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా గార మండలం వత్సవలస సముద్రతీరంలో ఈ కంపెనీ చేపట్టిన బీచ్‌శాండ్‌ తవ్వకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు గుర్తించారు. ఈ కంపెనీ అనుమతులు రద్దు చేయాలని, రూ.1,295 కోట్ల అపరాధ రుసుం వసూలు చేయాలని 2016లో అప్పటి టిడిపి ప్రభుత్వానికి అధికారులు సిఫార్సు చేశారు. ఆ ప్రభుత్వం తవ్వకాల అనుమతుల రద్దుతో సరిపెట్టి అపరాధ రుసుము వసూలు చేయలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వమూ అపరాధ రుసుము వసూలుపై దృష్టి పెట్టలేదు. పైగా విశాఖ పోర్టులో ట్రైమెక్స్‌ కంపెనీ నిల్వ ఉంచిన 22,982 మెట్రిక్‌ టన్నుల ఇల్మనైట్‌ ఖనిజాన్ని తమిళనాడు రాష్ట్రం తూతుకుడిలోని వి.వి.టైటానియం పిగ్మెంట్స్‌కు తరలించేందుకు ఈ ఏడాది జులై 16న అనుమతులు ఇచ్చింది. అపరాధ రుసుం చెల్లించని పక్షంలో కనీసం ఇల్మనైట్‌ ఖనిజాన్నైనా జప్తు చేసే అవకాశాన్ని ప్రభుత్వం జార విడుచుకోవడంపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
అక్రమాల కథా కమామిషు
గార మండలం వత్సవలస, తోణంగి గ్రామాల్లోని 1777.74 ఎకరాల్లో కోస్టల్‌ రెగ్యులేటరీ జోన్‌, కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఇలిమినైట్‌, గార్నెట్‌, జిర్కాన్‌, రుటైల్‌, సిలిమినేట్‌, లుక్సైన్‌ తదితర బీచ్‌శాండ్‌ ఖనిజాల తవ్వకాలను ట్రైమెక్స్‌్‌ కంపెనీ చేపడుతున్నట్లు 2013లో ఉమ్మడి రాష్ట్ర హైకోర్టులో హైదరాబాద్‌కు చెందిన సుంకావల్లి మౌర్య అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశారు. హైకోర్టు ఉత్వర్వుల మేరకు 2014లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ విచారణ చేపట్టింది. తవ్వకాలు చేపట్టిన ప్రాంతాలను గనులు, భూగర్భ శాఖ, రెవెన్యూ శాఖ, ఎపి పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులతో కలిసి విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు 2015 జూన్‌, సెప్టెంబర్‌, నవంబర్‌ నెలల్లో పరిశీలించారు. సర్వే జరగని వివాదస్పద తీర భూములకు చెందిన 387.72 ఎకరాల్లోని 304.4 ఎకరాల్లో తవ్వకాలు జరిపినట్లు గుర్తించారు. 2009 నుంచి 2016 వరకు సాగిన తవ్వకాల్లో రూ.1295.63 కోట్ల విలువైన ఖనిజాలను 17,58,112 టన్నుల మేర తవ్వి, రవాణా చేసినట్లు తేల్చారు. బీచ్‌శాండ్‌ ఖనిజాల దోపిడీ ప్రక్రియలో 9,750 మెట్రిక్‌ టన్నుల మోనోజైట్‌ ఖనిజాన్ని ప్లాంట్‌ భూగర్భంలో కంపెనీ నిల్వ చేసినట్లు గుర్తించారు.
ఖనిజం తరలింపు ఉత్తర్వులను నిలుపుదల చేయాలి
ట్రైమెక్స్‌ కంపెనీ అక్రమాలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ రూ.1,295 కోట్ల జరిమానా విధించింది. ఈ రోజు వరకు వడ్డీ లెక్కిస్తే రూ.2,230 కోట్లు అవుతుంది. జరిమానాను ఇప్పటివరకు వసూలు చేయకపోవడం బాధాకరం. జరిమానా వసూలుకు ట్రైమెక్స్‌ ఆస్తులను, నిల్వలను జప్తు చేసే అవకాశాన్ని వదులుకోకూడదు. ప్రస్తుత ప్రభుత్వం 22,982 మెట్రిక్‌ టన్నుల విలువైన ఖనిజాన్ని వేరొక కంపెనీకి తరలించేందుకు అవకాశం కల్పించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రభుత్వ ఉత్తర్వుల తర్వాత ఏడు వేల మెట్రిక్‌ టన్నుల ఖనిజాన్ని ఆ కంపెనీ ఇప్పటికే తరలించింది. తరలింపు ఉత్తర్వులను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాను. దీంతో, ప్రస్తుతం తరలింపు ఆగింది.
                                                             ఇ.ఎ.ఎస్‌ శర్మ, విశ్రాంత ఐఎఎస్‌ అధికారి