Nov 27,2020 22:04

డీఎస్పీ బంగ్లా రోడ్డులో అడ్డంగా ఉన్న చెట్లను తొలగిస్తున్న జెసిబి

డీఎస్పీ బంగ్లా రోడ్డు నిర్మాణానికి ఏర్పాట్లు
ప్రజాశక్తి - ఆదోని: 
ఆదోని పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఇరుకు రోడ్లు, పెద్ద వాహనాల రాకపోకల వల్ల పట్టణ ప్రధాన రహదారులన్నీ నిత్యం రద్దీగా ఉంటాయి. బయటి వాహనాలు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ రోడ్లు లేకపోవడం వల్ల మున్సిపల్‌ ప్రధాన రోడ్డు గుండానే వెళ్లాల్సి ఉంది. ఈ రోడ్డు ఎప్పుడు చూసినా వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తే గంటలపాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. కర్నూలు రోడ్డు గుండా బళ్లారి, రాయచూరు, గుంతకల్లు ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు పట్టణంలోకి వచ్చి వెళ్లాల్సి ఉంటుంది. ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించాలని పలుమార్లు ప్రభుత్వాలను, ప్రజాప్రతినిధులను, అధికారులను కోరుతూనే ఉన్నారు.
రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు : నిర్మల్‌ టాకీస్‌ ఎన్‌టిఆర్‌ విగ్రహం నుంచి డీఎస్పీ బంగ్లా రోడ్డు గుండా రైల్వే ట్రాక్‌ వరకూ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు మున్సిపల్‌ కమిషనర్‌ ఆర్‌జివి.కృష్ణ తెలిపారు. గేటు నుంచి శంకర్‌ నగర్‌ మీదుగా ఆలూరు రోడ్డు, అలాగే కొత్తగా ఏర్పాటు చేసే రోడ్డు నుంచి ఢణాపురం వరకూ రాకపోకలు నిర్వహించేందుకు రోడ్డు ఉపయోగపడుతుందని చెప్పారు. 14వ ఆర్థిక సంఘం నిధుల కింద రూ.84 లక్షలు మంజూరైనట్లు వివరించారు. ఇప్పటికే రోడ్డు ఏర్పాట్లకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డితో, మున్సిపల్‌ ఇంజినీర్‌ సత్యనారాయణ రావు చర్చించామని తెలిపారు. టెండర్లు పూర్తయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. రోడ్డు నిర్మాణానికి ఆటంకంగా ఉన్న చెట్లను, అక్రమంగా ఏర్పాటు చేసుకున్న డబ్బా బంకులు, దుకాణాలను తొలగించే పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఈ రోడ్డు వాడకంలోకి వస్తే ట్రాఫిక్‌ సమస్య కొంతవరకు తీరుతుందని చెప్పారు.