Nov 22,2020 23:38

సంతకాలు సేకరిస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి-కాకినాడ రూరల్‌ : భారీ వాహనాలు ఇంద్రపాలెం మీదుగా రాకుండా వార్ఫ్‌ రోడ్డు మీదుగా మళ్ళించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఆదివారం సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కమిటీ సభ్యుడు మాజీ సర్పంచ్‌ పలివెల వీరబాబు మాట్లాడారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కాలంలో భారీ వాహనాలు ఇంద్రపాలెం మీదుగా చీడిగ వద్ద జాతీయ రహదారికి రాకపోకలు సాగించాయన్నారు. కానీ లాక్‌డౌన్‌ సడలించి సాధారణ పరిస్థితులు వచ్చాక రోజువారీ ట్రాఫిక్‌ చాలా ఎక్కువగా ఈ రోడ్డులో ఉంటోందన్నారు. కాకినాడ రూరల్‌, పెదపూడి, బిక్కవోలు, రాయవరం మండలాల పరిధిలో వివిధ గ్రామాల ప్రజలు ఇంద్రపాలెం రోడ్డు మీదుగానే కాకినాడ చేరుకుంటారని తెలిపారు. గ్యాస్‌ హారన్లతో, అతివేగంగా నడుస్తున్న భారీ వాహనాల వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా రూరల్‌ సిఐ, ఇంద్రపాలెం ఎస్‌ఐ, వారి సిబ్బంది బీట్‌ ఏర్పాటు చేశారన్నారు. వారి డ్యూటీ సమయం ముగిసిన తర్వాత వందల వాహనాలు యథావిధిగా ప్రయాణిస్తున్నాయని వాపోయారు. స్థానిక ఎంఎల్‌ఎ రాష్ట్ర మంత్రిగా ఉండడం సంతోషకరమని, సమస్య పరిష్కారానికి ఆయన జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఇంద్రపాలెం శాఖా కార్యదర్శి సిహెచ్‌.విజరు కుమార్‌, వాసంశెట్టి చంద్రరావు, గేరా పద్మ, అనసూరి శివ, పేరూరి నాగదేవి, రాజ్‌ కుమార్‌, పిల్లి అన్నవరం, భాస్కర్‌, అమ్మాజీ, మంగాదేవి, మేడిశెట్టి వెంకట రమణ పాల్గొన్నారు.