Nov 30,2020 10:56

న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. గత మూడు రోజులుగా రైతులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నిరసనల్లో వయసు పై బడిన మహిళలు కూడా ఉన్నారు. వీరంతా ట్రాక్టర్లలో నిద్రిస్తూ, రోడ్లపక్కన స్నానం చేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతులకు న్యాయం జరిగేంతవరకూ ఈ పోరాటం కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు. 50 ఏళ్ల చిరంజీత్‌ కౌర్‌ మాట్లాడుతూ.. ట్రాక్టర్లన్నీ నిరసన ప్రదేశానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని, భోజనం సమయంలో అక్కడ వంట చేసుకుంటున్నామని, మిగిలిన సమయాల్లో నిరసన ప్రదేశంలో ఉంటున్నామని అన్నారు. ఈ ట్రాక్టర్లే ప్రస్తుతానికి మా ఇళ్లు అని అన్నారు. ఆందోళనల్లో పాల్గొనే వారందరికీ ఇక్కడే భోజనం సిద్ధం చేస్తున్నామని, అందులో మాకు యువ రైతులు సహకరిస్తున్నారని చెప్పారు. ఎక్కువ సమయం ఇక్కడే ఉండకుండా చపాతీ, ఒక కూర సిద్ధం చేసుకుంటున్నామని అన్నారు. ఢిల్లీ చేరుకునే ముందే అందరం కలిసి ఉమ్మడిగా ఒక ఒప్పందం చేసుకున్నామని, ఒక్కొక్కరు కొన్ని సరుకులు తెచ్చుకున్నామని చెప్పారు. రైతు వ్యతిరేక నూతన వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం వెనక్కు తీసుకునేంత వరకు ఈ నిరసనను కొనసాగిస్తామని చెప్పారు.
సింగు సరిహద్దులో మూడు రోజులుగా నిరసన చేస్తున్న మహిళల్లో పటియాలాకు చెందిన 70 ఏళ్ల గురుదేవ్‌ కౌర్‌ కూడా ఉన్నారు. వందలాది మంది మహిళలు కూడా ఈ నిరసనలో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్నారు. గత మూడు రోజులుగా ట్రాక్టర్‌ ట్రాలీల్లో నిద్రిస్తున్నామని, రోడ్ల పక్కన స్నానం చేస్తున్నామని, అయినప్పటికీ రైతుల డిమాండ్లను ప్రభుత్వం తీర్చే వరకు ఎన్ని నెలలైనా నిరసనలో పాల్గొంటామని చెప్పారు. ఢిల్లీలో ఆందోళన చేస్తామని తెలిపినపుడు, మరో ఆలోచన లేకుండా అంగీకరించానని సెప్చువాజెనరీయన్‌ కౌర్‌ అనే మహిళా రైతు అన్నారు. పంజాబ్‌లో గత రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నామని, కార్యాచరణ ప్రణాళికపై సమావేశాలకు హాజరవుతున్నామని చెప్పారు. చివరి శ్వాస వరకు ఆందోళనకు మద్దతు ఇస్తామని ఆమె చెప్పారు. కొన్నేళ్ల క్రితం తన భర్త మరణించారని, ఇద్దరు కుమారులు ఉన్నారని, వారే కుటుంబాన్ని చూసుకుంటారని చెప్పారు. తన వయస్సు ఎక్కువ కావడంతో వారు ఆందోళన చెందుతున్నారని, అయితే తాను ఇక్కడ ఒంటిరిగా లేనని అన్నారు. మందులు, నిత్యావసరాలు సరిపడినన్ని ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు తన మనవరాళ్లు ఇంటిని చూసుకుంటున్నారని, తరచుగా ఫోన్‌లో క్షేమసమాచారాలు కనుక్కుంటున్నారని అన్నారు. కెనడాలో ఉన్న తన మనవడితో కూడా అప్పుడప్పుడూ మాట్లాడుతున్నానని చెప్పారు. నూతన చట్టాలతో వ్యవసాయ ఉత్పత్తులను సేకరించడం, వాటిని విక్రయించడం కష్టతరమౌతుందని పేర్కొన్నారు.