Jan 28,2021 00:26

తరచూ నిలిచిపోతున్న వాహనాలు
పనిచేయని సిగలింగ్‌ వ్యవస్థ

ప్రజాశక్తి - విజయవాడ ప్రతినిధి
విజయవాడ నగరంలో తరచూ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. నగరంలో వాహనాలు కదలడానికి ఎక్కువ సమయం పడుతోంది. దీంతో చోదకులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. కీలకమైన సమయాల్లో ఇది మరి కాస్తా ఎక్కువుగా ఉంటోంది. ఉదయం కార్యాలయాలకు వెళ్లే సమయంతో పాటు సాయంత్రం కార్యాలయాల నుంచి ఇళ్లకు చేరుకునే సమయాల్లో భరీగా వాహనాలు నిలచి పోతున్నాయి.
నవంబరులో ప్రారంభం నవంబరు 2020లో బెంజిసర్కిల్‌ రెండో ఫ్లైఓవర్‌ పనులు ప్రారంభం అయ్యాయి. లక్ష్మీ ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. స్క్రూబ్రిడ్జి నుంచి నోవాటెల్‌ హోటల్‌ వరకు బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు విలువ సుమారు రూ.100 కోట్లు. బ్రిడ్జి నిర్మాణం వల్ల రోడ్డు మార్గం సగానికి తగ్గిపోయింది. తవ్వకాలకు సంబంధించిన మట్టి వంటివి పక్కన వేస్తుండటం వల్ల సర్వీసు రోడ్లు కూడా ఇరుకుగా మారాయి. ఇది జాతీయ రహదారి కావడం వల్ల నిత్యం రద్దీగా ఉంటుంది. పెద్ద సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఒక నిమిషం వాహనాలు ఆగినా భారీ స్థాయిలో వాహనాలు నిలచిపోతున్నాయి.
మైక్‌ల ద్వారా కంట్రోలింగ్‌
నగరంలో ప్రధాన రహదారుల్లో ఒకటైన బందరు రోడ్డు బెంజిసర్కిల్‌ మీదుగా వెళ్తుంది. వేల సంఖ్యలో వాహనాలు దీని గుండా ప్రయాణిస్తుంటాయి. దీనికితోడు ఏలూరు రోడ్డు బెంజిసర్కిల్‌ మీదుగానే వెళ్తుంది. నగర వాసులతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వెళ్లే భారీ వాహనాలు కూడా ఈ రోడ్డు మీదుగానే ప్రయాణిస్తుంటాయి. ట్రాఫిక్‌ నియంత్రణలో ఒక నిమిషం ఆలస్యమైనా బెంజిసర్కిల్‌ నుంచి స్క్రూబ్రిడ్జి వరకు, అటువైపు ఆర్‌సిఎం చర్చి వరకు వాహనాలు ఆగిపోతున్నాయి. బందరు రోడ్డులో కూడా ఇదే పరిస్థితి నెలకొంటోంది. ఇటు డివిమేనర్‌ హాటల్‌ వరకు అటు ఎన్టీఆర్‌ సర్కిల్‌ వరకు వాహనాలు నిలచిపోతున్నాయి. దీనికితోడు ఇక్కడ ట్రాఫిక్‌ సిగల్స్‌ పని చేయడం లేదు. ట్రాఫిక్‌ సిబ్బంది మైక్‌ల ద్వారా చెబుతున్నారు. దీంతో నియంత్రణ సమస్యగా మారింది. అంతేకాకుండా రెండు వైపుల నుంచి ఒకేసారి వాహనాలను వదులుతున్నారు. బందరు రోడ్డు నుంచి నేరుగా ఎన్టీఆర్‌ సర్కిల్‌ వైపు వెళ్లే వాహనాలను, ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి బందరు రోడ్డులోకి వెళ్లే వాహనాలను ఒకే సమయంలో వదులుతున్నారు. అలాగే స్క్రూబ్రిడ్జి నుండి ఏలూరు వైపు వెళ్లే వాహనాలు, ఆర్‌సిఎం చర్చి నుంచి స్రూబ్రిడ్జి వైపు వెళ్లే వాహనాలను ఒకేసారి వదులుతున్నారు. దీంతో బందరు రోడ్డు నుంచి స్క్రూబ్రిడ్జి వైపు వెళ్లే వారికి, ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి బందరు రోడ్డులోకి వెళ్లే వారికి, స్క్రూబ్రిడ్జి వైపు నుంచి ఎన్టీఆర్‌ సర్కిల్‌ వైపు వెళ్లే వారికి, ఆర్‌సిఎం చర్చి నుంచి బందరు రోడ్డు వైపు వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారు. ఎదురెదురుగా వాహనాలు వస్తుండటంతో ప్రమాదాలు జరుగుతాయని వాహన చోదకులు భయపడుతున్నారు. ఎదురెదురుగా వాహనాలు రావడం వల్ల తరచుగా ట్రాఫిక్‌ కూడా జామ్‌ అవుతోంది. ఇదే పరిస్థితి రమేష్‌ ఆసుపత్రి జంక్షన్‌, ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ జంక్షన్‌లలో కూడా నెలకొంటోంది. దీంతో పోలీసులకు ట్రాఫిక్‌ నియంత్రణ ఒక ప్రహసనంగా మారింది.
వేగంగా పనులు
మరో వైపు ఫ్లైఓవర్‌ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. 2021 మే నాటికి 10 శాతం, 2021 సెప్టెంబరు నాటికి 35 శాతం పనులు చేయాలని నిర్ణయించినా ఇప్పటికే సుమారు 45 శాతం పనులు పూర్తి చేశారు. ఏప్రిల్‌ 2022 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. దాని కంటే ముందుగానే పూర్తి చేసే విధంగా పనులు జరుగుతున్నాయి.