Jan 14,2021 11:16

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా జనవరి 16 నుంచి కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసందే. వ్యాక్సిన్‌ పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయి. నిర్దేశించిన ప్రాంతాలకు వ్యాక్సిన్‌ను ఇప్పటికే తరలించారు. కాగా, తొలి రోజు దాదాపు 3 లక్షల మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. వ్యాక్సినేషన్‌ కోసం దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 2,934 కేంద్రాలకు గానూ ఒక్కో కేంద్రంలో వంద మందికి టీకాను ఇవ్వనున్నారు. ఈ మేరకు ఏర్పాటు పూర్తి చేశారు. కాగా, ప్రతి కేంద్రంలోనూ నిర్దేశించుకున్న టీకాల సంఖ్య కంటే తక్కువ కాకుండా చూసుకోవాలని, అవసరమైన వాటికంటే పది శాతం అదనంగా అందుబాటులో ఉంచుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు సూచించింది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న కేంద్రాల సంఖ్యను రాష్ట్రాలు పెంచుకుంటూ వెళ్లాలని సూచించింది. తొలి దశలో భాగంగా కోటి మందికి టీకా అందించేందుకు కేంద్రం సిద్ధమైన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే 1.65 కోట్ల డోసులను ప్రభుత్వం సేకరించింది. వాటిలో కొవిషీల్డ్‌ నుంచి 1.1 కోట్ల డోసులు, కొవాక్సిన్‌ నుంచి 55 లక్షల డోసులను సేకరించింది.