
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి రెండు టెస్టులకు రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ దూరమయ్యారు. ఇద్దరూ ఇంకా ఫిట్నెస్గా లేరని, వారు ఫిట్నెస్ సాధించడానికి ఇంకా నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉందని, దీంతో తొలి రెండు టెస్టులకు దూరమై, చివరి రెండు టెస్టులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని బిసిసిఐ అధికారి ఒకరు తెలిపారు. దుబారులో ఇటీవల నిర్వహించిన ఐపిఎల్‌లో రోహిత్ గాయపడిన సంగతి తెలిసిందే. ఇషాంత్ కూడా పక్కటెముకల గాయంతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్నారు. వీరిద్దరూ ఫిట్నెస్ సాధించి నెల రోజుల తరువాత ఆస్ట్రేలియా వెళ్లినా.. 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలి. కాబట్టి తొలి రెండు టెస్టులకు అందుబాటులో ఉండరని బిసిసిఐ అధికారి ఒకరు తెలిపారు. కాగా, రోహిత్ శర్మ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను తీసుకోవచ్చని సమాచారం. ఇక ఇషాంత్ స్థానంలో పేసర్లు దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, నటరాజన్‌లలో ఒకరిని తీసుకోవచ్చు. ప్రస్తుతం వీరు ఆస్ట్రేలియాలోనే ఉన్నారు. ఈనెల 27 నుంచి ఇండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే, డిసెంబర్ 17న టెస్టు సిరీస్ ప్రారంభం కానున్నాయి.