Oct 14,2021 15:50

అమరావతి : ఆప్కాస్ (ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ అవుట్‌సోర్డ్స్‌ సర్వీసెస్‌) లో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించడం అన్యాయమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సిఎం జగన్ కు లేఖ రాశారు.  తిరిగి వారిని విధుల్లోకి తీసుకోవటంతో పాటు 20 నెలల వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని లోకేశ్ డిమాండ్ చేశారు. వారికి జీతాలిచ్చే ఏజెన్సీలను రద్దు చేసి ఆప్కాస్ పరిధిలోకి తీసుకొస్తూ మరో మోసానికి తెరలేపారని ఆరోపించారు. సీఎఫ్ఎంఎస్ గుర్తింపు కార్డులు సృష్టించి ఉద్యోగుల గొంతు కోశారని పేర్కొన్నారు. ఏజెన్సీలు లేకుండా జీతాలివ్వలేమంటూ 20 నెలల బకాయిలు ఎగ్గొట్టి ఉద్యోగాలు తొలగించి, వారి జీతాలను ఎటు మళ్లించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా సీఎఫ్ఎంఎస్‌లో న‌మోదు చేయ‌డంతో వారి తెల్ల రేష‌న్‌కార్డులను రద్దు చేసి,  అన్ని ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా మిగిలారని తెలిపారు. పెండింగ్ జీతాలు అడుగుతున్నార‌ని అనేక మందిని తొలగించటం అరాచకానికి నిదర్శనమని అని లేఖలో లోకేశ్‌ పేర్కొన్నారు.