May 30,2021 14:42

   ఒక అడవిలో జంతువులన్నీ రాజైన సింహం అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఆ సమావేశానికి వచ్చిన జంతువులన్నీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో కుందేలు కలుగజేసుకుని 'ఎవరూ ఏమీ మాట్లాడకపోతే సమావేశం దేనికి?' అని ప్రశ్నించింది. దీంతో ఒక్కటొక్కటిగా జంతువులు తమ బాధను వెళ్ళబుచ్చాయి. చివరిగా సారాంశం ఏమిటంటే.. ''మనుషులు ఈ అడవిలోని చెట్లను నరికి వేయడం వల్ల అడవి విస్తీర్ణం తగ్గిపోవటంతో మన ఆవాసాలు నాశనం అవుతున్నాయి. మన జీవనం ప్రశ్నార్థకంగా మారుతుంది. కనుక ఎలాగైనా మనుషులు చెట్లను నరకకుండా చూడాలని వారికి నచ్చజెప్పాలి'' అని తీర్మానించాయి. అయితే ఈ బాధ్యతను చిలుకకు అప్పజెప్పారు! ఎందుకంటే చిలుక మనిషిలాగా మాట్లాడే స్వభావం గల జీవి అని. చిలుకకు సహాయంగా కుందేలు, ఉడతలను కూడా నియమించారు.
   బాధ్యతలు స్వీకరించిన వెంటనే చిలుక బృందం చెట్లు కొడుతున్న ప్రదేశానికి చేరుకుంది. అక్కడ కొందరు మనుషులు చెట్లను నరికేస్తున్నారు. చూస్తుండగానే కొన్ని వందల చెట్లు నేలరాలిపోతున్నాయి. చిలుక అక్కడ పనిచేస్తున్న ఒక వ్యక్తి దగ్గరకు వెళ్లి 'హలో...హలో... చెట్లను నరకడం ఆపండి! మీరు ఎందుకు చెట్లను నరుకుతున్నారు?' అంది.
'ఇది మాకు జీవనాధారం. చెట్లను కొట్టి ఆ కలపను అమ్ముకుంటాం.. నీకేమన్నా కావాలంటే కొన్ని పుల్లలు తీసుకుపోయి, గూడు కట్టుకో' అన్నాడు ఆ మనిషి.
'దయచేసి చెట్లను నరకడం ఆపండి. మీరు ఈ అడవిలోని చెట్లను నరికితే, ఇందులో నివసించే జీవులన్నీ చెల్లాచెదురై, రక్షణ లేక మరణిస్తాయి. జీవజాతులు ప్రమాదంలో పడతాయి. దయచేసి చెట్లను నరకడం ఆపండి!' అని ప్రార్థించింది చిలుక.
'ఆపము ఈ కట్టెలను అమ్ముకునే మేము జీవనం సాగించేది.. మేము బతకొద్దా ఏంటి?' అన్నాడు ఆ మనిషి.
'మీరు ఇంకో పని ఏదైనా చేసుకుంటే మీ జీవనం సాగుతుంది. కానీ మాకు ఈ అడవి లేకపోతే జీవితమే ఉండదు ఆలోచించండి. చెట్లను నరకడం ఆపండి' అని ప్రాధేయపడింది చిలుక.
'నా పనికి అడ్డు రాకు. ఇక్కడి నుంచి పోతావా? లేదా?' అంటూ గట్టిగా అరిచాడు ఆ మనిషి. చేసేదిలేక అక్కడి నుంచి అడవి లోపలకు బయలుదేరింది చిలుక బృందం.
విషయాన్ని జంతువుల దృష్టికి తీసుకెళ్ళింది బృందం. ఈసారి చెట్లు నరికేవారి ఆవాసం ఎక్కడో తెలుసుకుని రమ్మని కోతికి ఆ పనిని అప్పగించారు. కోతి వెళ్ళి వాళ్ళు ఉండే ఆవాసాన్ని గుర్తించి వచ్చింది. 'వారు ఈ అడవికి ఉత్తరాన ఉన్న గ్రామంలో ఉన్నారు' అని తెలిపింది. ఈసారి జంతువులు తమ పంథాను మార్చాయి. ఏనుగు, చిలుక, కోతి, ఎలుగుబంటితో ఓ సమూహంగా ఏర్పడి, అందరూ కలిసి ఉత్తరాన ఉన్న గ్రామానికి బయలుదేరాయి. ఆ గ్రామానికి చేరుకోగానే కోతి చూపించిన ఆ మనుషుల ఆవాసాల దగ్గరకు వెళ్ళిన గజరాజు వారి ఆవాసాలను ధ్వంసం చేయసాగింది. ఆ అలజడికి భయపడిన మనుషులు లోపలి నుంచి బయటకొచ్చారు. జంతువులను చూసి వాటిని తరమడానికి ఆయుధాలను తీసుకొచ్చారు. ఇంతలో అక్కడే ఉన్న చిలుక 'హలో ఓ మనిషి ఏమైంది? ఇది మీ ఆవాసమా, ఇది లేకపోతే ఏమవుతుంది? ఎందుకు అంతగా కంగారు పడుతున్నావ్‌!' అన్నది.
'నివాసం లేకపోతే ఎట్లా ఎక్కడ ఉండాలి? అసలే ఇక్కడ సమీపంలోనే అడవి ఉంది. దానిలోని క్రూర జంతువుల నుంచి రక్షణ ఎలా?' అన్నాడు ఆ మనిషి.
'మరి మా నివాసమైన అడవిని మీరు నాశనం చేస్తుంటే.. మాకు ఆ బాధ ఉండదా? పైగా అడవులను నరకడం వల్ల వర్షాలు పడవు, పంటలు పండవు, భూమి మీద మొక్కలు లేకపోతే వాయు కాలుష్యం పెరుగుతుంది. ఇదంతా మనిషి జీవనం మీదా ప్రభావం పడుతుంది.. తర్వాత మీ ఇష్టం' అన్నది చిలుక.
ఒక్కసారిగా ఆలోచనలోపడ్డారు ఆక్కడ ఉన్న మనుషులు. నిజమే వాటి ఆవాసాలు అడవులే కదా! మరి వాటిని నాశనం చేస్తుంటే వాటికి బాధ ఉంటుంది కదా?! అలాగే మనుషులమైన మనకు తీవ్రనష్టం 'మమ్మల్ని క్షమించండి జంతుజాలం. ఇప్పటి నుంచి అడవిలోని చెట్లను నరకం. ఇక్కడే వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తాం' అన్నారు అక్కడున్న మనుషులు.
తమ సమస్య తీరినందుకు జంతువులు ఆనందంతో అడవిదారి పట్టాయి.
 

- ఏడుకొండలు కళ్ళేపల్లి,
మచిలీపట్నం
94908 32338