Oct 14,2021 17:13

చెన్నై : రాజకీయాల్లోకి దళపతి విజయ్ మక్కల్‌ ఇయక్కం (టీవీఎంఐ) గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చింది. తొమ్మిది జిల్లాల గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్రులుగా పోటీ చేసిన ఇయక్కం అభ్యర్థులు గెలుపొందారు. నటుడు విజయ్ రాజకీయ రంగ ప్రవేశం కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు స్థానిక ఎన్నికలు ఉత్సాహాన్ని కల్గించాయి. ఈ సందర్భంగా ఇయక్కం ప్రధాన కార్యదర్శి బుస్సీ ఎన్‌.ఆనంద్‌ మాట్లాడుతూ మొత్తం 169 మంది పోటీ చేయగా 121 మంది అభ్యర్ధులు గెలిచారని తెలిపారు. ఇది ప్రారంభం మాత్రమేనని పేర్కొన్నారు. వివిధ జిల్లాల్లో పర్యటించినప్పుడు ఎన్నికల్లో ఇయక్కం అభ్యర్ధులకు ఓటేస్తారన్న నమ్మకం కలిగిందన్నారు. విళ్లుపురం జిల్లా వానూర్‌ పంచాయతీ యూనియన్‌లో టీవీఎంఐకి చెందిన సావిత్రి పంచాయతీ అధ్యక్షురాలిగా ఎన్నికైనట్లు తెలిపారు. మహిళలు, యువత, విద్యార్థులు విజయ్ పై గొప్ప అభిమానాన్ని చాటుతున్నారని పేర్కొన్నారు. విజయ్ కానీ, అభిమాన సంఘం కానీ బహిరంగంగా తమ అభ్యర్థులకు ఓటేయమని ప్రచారం చేయలేదని గుర్తుచేశారు. రాష్ట్రంలో జరుగనున్న పట్టణ స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆనంద్‌ తెలిపారు. దళపతి విజయ్ ప్రచారం చేస్తే ఫలితాలు మరోల ఉండేవన్నారు.