Feb 28,2021 08:36

చెన్నై: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగం పుంజుకున్నాయి. అన్నాడిఎంకె, డిఎంకె కూటములను ఢీ కొట్టేందుకు .. మూడో కూటమికి ఏర్పాటుకు సన్నాహాలు జోరందుకున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో అన్నాడిఎంకె, డిఎంకె కూటముల మధ్యనే ప్రధాన పోటీ ఉండేది. ఈ ఆనవాయితీకి చెక్‌పెట్టేందుకు ప్రధాన సూత్రధారి శశికళ రంగంలోకి దిగారు. అన్నాడింఎకె, డిఎంకె కూటముల్లోని అసంతృప్త  పార్టీలతో మూడో కూటమి ఏర్పాటు కానుంది. ఈ కూటమి ఏర్పాట్లలో తెరవెనుక శశికళ, తెరముందు శరత్‌కుమార్‌ సారథ్యం వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అన్నాడిఎంకె కూటమిలో బిజెపి, పిఎంకె, డిఎండికెలతో పాటు రెండు చిన్న పార్టీలు ఉన్నాయి. అలాగే డిఎంకె కూటమిలో కాంగ్రెస్‌, వామపక్షాలు, విసికె పార్టీలున్నాయి. ఇండియా జననాయక కట్చి (ఐజెకె ) డిఎంకె నుండి ఇటీవల బయటకి వచ్చింది. మూడో కూటమికి ఐజెకె సారథ్యం వహిస్తున్నట్లు సమాచారం. అయితే ఐజెకెకి రాష్ట్రంలో పెద్దగా క్రేజ్‌ లేకపోవడంతో.. శశికళ వెనకుండి నడిపిస్తున్నారని తెలుస్తోంది. అన్నాడిఎంకె కూటమిలోని సమత్తువ మక్కల్‌ కట్చి అధ్యక్షుడు, నటుడు శరత్‌కుమార్‌ కొద్దిరోజుల ఇటీవల శశికళతో భేటీ కావడంతో ఈ ఊహాగానాలు వాస్తవమేనని స్పష్టమైంది.
ఇటీవల అన్నాడిఎంకె కూటమిని వీడిన శరత్‌కుమార్‌ ఐజెకెతో జతకట్టారు. పదేళ్లు అధికార పార్టీ కూటమితో కలిసి ప్రయాణించానని, సీట్ల కేటాయింపుపై తనకు ఆహ్వానం లేకపోవడం వల్లనే వైదొలిగానని శరత్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. మూడో కూటమిని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ను శరత్‌కుమార్‌ శనివారం కలిసి కూటమిలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. అయితే డిఎంకె కూటమిలో చేరాలని కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న కమల్‌హాసన్‌కు నిరాశ ఎదురైంది. దీంతో ఐజెకె ఆహ్వానాన్ని మన్నించి మూడో కూటమిలో చేరతారని పలువురు భావిస్తున్నారు. మూడో కూటమి నుండి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. అభ్యర్థి ముఖ్యం కాదని, సిద్ధాంతాలకు లోబడి ప్రజాసంక్షేమం కోసం పాటుపడే పార్టీలను సంఘటితం చేసి గెలుపొందడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు శరత్‌కుమార్‌ పేర్కొన్నారు. కమల్‌ మంచి నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం ఉందని శరత్‌కుమార్‌ అన్నారు.
మరోవైపు తమిళనాడులోని మొత్తం 234 సీట్లలో పోటీచేసేందుకు బహుజన సమాజ్‌ పార్టీ సిద్ధమైంది. రాబోయే రోజుల్లో మూడో కూటమిలో చేరినా చేరవచ్చు. నటుడు రజనీకాంత్‌ స్థాపించదలుకున్న పార్టీకి ప్రధాన సమన్వయకర్తగా నియమితులైన అర్జున్‌మూర్తి 'ఇండియా మక్కల్‌ మున్నేట్ర కట్చి'అనే పార్టీని స్థాపించారు. బిజెపి నేపథ్యం కలిగిన అర్జున్‌మూర్తికి రజనీకాంత్‌ ఆశీస్సులు కూడా అందజేశారు. ఒకవేళ మూడో కూటమికి అధికారంలోకి వచ్చేంత సంఖ్యా బలం సమకూరకున్నా రెండు కూటముల్లోని అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీసే పరిస్థితి తప్పదని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
శశికళ మేనల్లుడు దినకరన్‌ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అమ్మ మక్కల్‌ మున్నేట్ర కజగం కూడా మూడో కూటమిలో చేరిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నామ్‌ తమిళర్‌ కట్చి కన్వీనర్‌ సీమాన్‌ కోసం కూడా ఐజెకె యత్నిస్తోంది. అన్నాడిఎంకె, డిఎంకె కూటముల్లో సీట్ల సర్దుబాటు పూర్తయితేగానీ అసంతఅప్తవాదులు బయటకు రారు. అప్పటి వరకు ఐజెకె వేచిచూడక తప్పదు. మూడో కూటమి ఏర్పాటు కొలిక్కిరాగానే.. శశికళ తెరపైకి రావచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు.