Sep 15,2021 08:55

కాబూల్‌ :  ఆఫ్ఘనిస్తాన్‌ హస్తగతం చేసుకున్న తాలిబన్‌లు ఇటీవల నూతన ప్రభుత్వాన్ని ప్రకటించింది. తాలిబన్‌లలో శక్తిమంతమైన విభాగానికి అధినేతగా పనిచేసిన ముల్లా మహమ్మద్‌ హసన్‌ అఖుంద్‌ను ప్రధానమంత్రిగా నియమించారు. మంత్రివర్గంలో హక్కానీలకు కీలక హోదా లభించింది. అయితే తాలిబన్‌ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ ఈ ప్రభుత్వ ప్రకటనపై అయిష్టత వ్యక్తం చేసినట్ల సమాచారం. బరాదర్‌ కొద్దిరోజులుగా ఎక్కడా కనిపించడంలేదు. సమావేశాలకు, ప్రెస్‌మీట్లకు కూడా హాజరుకావడంలేదు. తాలిబన్ల మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటులో జరిగిన ఘర్షణల్లో బరాదర్‌ మరణించినట్లు సోషల్‌మీడియాలో పలు వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ వార్తలపై బరాదర్‌ స్పందిస్తూ.. తనకేమీ కాలేదని, క్షేమంగానే ఉన్నట్లు ఒక ఆడియో మెసేజ్‌లో తెలిపారు. అయితే ప్రభుత్వంలో హక్కానీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం నచ్చని బరాదర్‌కు వారితో యుద్ధం జరిగిందని.. దీంతో ఆయన కాందహార్‌కు చేరుకున్నట్లు సమాచారం.
హమీద్‌ కర్జాయ్,  అబ్దుల్లా అబ్దుల్లా వంటి తాలిబానేతర నేతలకు ప్రభుత్వంలో ప్రాధాన్యం ఇస్తామని దోహా బఅందం గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ ప్రభుత్వ ఏర్పాటులో ఇతర దేశాలు జోక్యం చేసుకోబోవని పేర్కొంది. అయితే ప్రభుత్వ ఏర్పాటులో పాకిస్తాన్‌ జోక్యంచేసుకుంది. పాక్‌ ఐఎస్‌ఐ చీఫ్‌ ఫయాజ్‌ అహ్మద్‌ ఆఫ్ఘన్‌కు వెళ్లి .. ప్రభుత్వ ఏర్పాటులో పావులు కదిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రధాన శాఖలు హక్కానీలకు కేటాయించేలా ఒప్పించారు. దీంతో హమీద్‌ కర్జాయ్, అబ్దుల్లా అబ్దుల్లా నేతలకు చోటు దక్కలేదు. పాక్‌ జోక్యంపై మనస్తాపానికి గురైన బరాదర్‌ హక్కానీలతో వాగ్వివాదానికి దిగినట్లు సమాచారం. దీంతో అసంతృప్తికి గురైన బరాదర్‌.. ఎవరికీ చెప్పకుండా కాందహార్‌ వెళ్లిపోయాడని సమాచారం.