Feb 23,2021 21:54

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎండ నుండి, వాన నుండి అన్నదాతకు రక్షణ ఇచ్చే తలపాగాలు పోరాటంలోనూ తమ వంతు పాత్ర పోషించాయి. మంగళవారం నాడు పోరాటక్షేత్రాలన్నీ తలపాగలతో నిండిపోయాయి. వీటిలో అధికభాగం ఆకుపచ్చ తలపాగాలు! ఇది నరేంద్రమోడీ ప్రభుత్వం రూపొందించిన వ్యవసాయ వ్యతిరేక చట్టాలకు నిరసనగా తలపాగాలు సైతం పోరాటంలో పాలుపంచుకున్నట్టుగా కనిపించింది. మంగళవారం దేశవ్యాప్తంగా 'పగ్రి సాంబాల్‌ దివస్‌' (రైతు ఆత్మగౌరవ దినం) నిర్వహించాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా తలపాగాలు ధరించి ఆత్మగౌరవాన్ని చాటాలన్న ఎస్‌కెఎస్‌ పిలుపునకు అనూహ్య స్పందన లభించింది. ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న పోరాట క్షేత్రాలకు తలపాగాలతో రైతులు తరలివచ్చారు. వివిధ రాష్ట్రాల్లో జరిగిన అందోళనల్లోనూ ఇదే పరిస్థితి. చాచా అజిత్‌ సింగ్‌, స్వామి సహజనంద్‌ సరస్వతి జ్ఞాపకార్థం ఈ దివస్‌ను నిర్వహించాలని ఎస్‌కెఎం కోరింది. సింఘూ సరిహద్దు వద్ద జరిగిన కార్యక్రమంలో షాహీద్‌ భగత్‌ సింగ్‌ మేనళ్లుల్లు అభరు సంధు, తేజీ సంధు, అనుస్ప్రియా సంధు, గుర్జీత్‌ కౌర్‌ పాల్గొన్నారు. రైతు నాయకులు వారికి తలపాగా, మెమెంటోతో సత్కరించారు. మార్చి 23 (షాహీద్‌ భగత్‌ సింగ్‌ వర్థంతి) వరకు రైతుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకపోతే, రైతులకు మద్దతుగా అమరణ నిరాహార దీక్షకు దిగుతామని అభరు సంధు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 1906 నాటి పగ్రి సాంబాల్‌ లెహార్‌ ప్రాముఖ్యతను ఎస్‌కెఎం నాయకులు దర్శన్‌పాల్‌ వివరించారు. ఆ సమయంలో బ్రిటీష్‌ పాలకులు రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చారని, వాటికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమం విజయవంతమైందని తెలిపారు. అలాగే ప్రస్తుత రైతు ఉద్యమం కూడా విజయవంతమవుతుందని, రైతుల ఐక్యతే అందుకు రుజువని పేర్కొన్నారు. అలాగే స్వామి సహజనంద్‌ సరస్వతి జయంతిని కూడా రైతులు జరుపుకున్నారు. మరోవైపు ఉత్తర ప్రదేశ్‌లో రైతులపై దాడి చేసిన బిజెపి కార్యకర్తలపై చర్యలు తీసుకునే బదులు పోలీసులు రైతులనే అరెస్టు చేశారు. దీనిపై రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కర్ణాటక, తెలంగాణకు చెందిన రైతులు మంగళవారం టిక్రీ సరిహద్దుకు చేరుకొని ఉద్యమానికి మద్దతు తెలిపారు.