Jun 09,2021 07:03

ఇప్పటికైనా మించిపోయింది లేదు
జన్మనిచ్చిన కన్నతల్లికి
పెంచి పోషించిన ప్రకృతిమాతకు
నువ్వు చేసిన ద్రోహమేమిటో
ఒక్కసారి వెనుతిరిగి చూసుకో
పిండి ముద్దకు ప్రాణం పోసి నిన్ను మనిషిని చేస్తే
ఆ మనిషే నీ ఇంట పని మనిషై
చాకిరీ చేయలేక కళ్ళు తేలేస్తుంటే
ఆ జీవచ్ఛవాన్ని అనాథ శరణాలయాల్లోకి
నెట్టి పారేశావ్‌
అన్నం పెట్టిన భూమాతకు విషం పెట్టి
సారాన్ని పిండేశావ్‌
కర్కశంగా వృక్షాల్ని నరికేసి
ప్రాణవాయువు ప్రాణాన్నే తీసేశావ్‌
కర్ణ కఠోరమైన శబ్ద కాలుష్యంతో
ప్రకృతిమాతను చెవిటిదాన్ని చేసేశావ్‌
నీ జీవనానికి నీ సంస్కృతికి
ఆధారమైన జీవనదులకి
వ్యర్ధాలతో మృత్యు ద్వారాలు తెరిచేశావ్‌
నీ వికృత పోకడల్తో సమస్త జీవరాశి ఉనికిని
ప్రమాదంలోకి నెట్టేశావ్‌
నీ పాపాలతో భూతాపాన్ని పెంచేసి
భావితరాల జీవితాల్ని ప్రశ్నార్ధకంగా మార్చేశావ్‌
ఆ ఇరువురు తల్లులిప్పుడు క్షోభిస్తుంటే
నీ జీవితానికి అర్ధం పరమార్ధం
నీకే తెలియాలి.
 

- యం.యస్‌. రాజు,
సెల్‌: 950203266