Sep 14,2021 20:25

ప్రజాశక్తి-శ్రీకాకుళం ప్రతినిధి : తిత్లీ బాధిత రైతులకు అదనపు పరిహారం చెల్లింపుల్లో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఇదిగో అదిగో అంటూ ప్రభుత్వం వారిని ఊరిస్తోంది. పరిహారం చెల్లింపుల కోసం ఉత్తర్వులు వెలువరించి రెండేళ్లు గడచినా నేటికీ వారి ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. మరోవైపు అదనపు పరిహారం చెల్లింపునకు లబ్ధిదారుల జాబితా తయారీలో రాజకీయ జోక్యం చేసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
2018 అక్టోబర్‌లో తిత్లీ తుపాను సృష్టించిన బీభత్సంతో వ్యవసాయ పంటలతో పాటు వేలాది ఎకరాల్లో కొబ్బరి, జీడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పటి టిడిపి ప్రభుత్వం కొబ్బరి చెట్టుకు రూ.1500 చొప్పున చెల్లించింది. జీడిపంటకు సంబంధించి హెక్టారుకు రూ.30 వేలు చెల్లించింది. తాము అధికారంలోకి వస్తే తిత్లీ పరిహారం పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కొబ్బరి చెట్టుకు అదనంగా రూ.1500, జీడి పంటకు అదనంగా మరో రూ.20 వేలు పరిహారం ప్రకటిస్తూ 2019 సెప్టెంబర్‌ మూడో తేదీన ప్రభుత్వం జిఒ నంబరు 11ను వెలువరించింది.
రూ.170.50 కోట్లతో సిఫార్సు
తిత్లీ తుపాను ప్రభావంతో 86,840 మంది రైతులు నష్టపోయినట్లు గుర్తించి, వారికి పరిహారం కింద గత ప్రభుత్వం రూ.239.74 కోట్లుగా చెల్లించింది. ఇందులో జీడిపంటకు సంబంధించి 51,314 మంది రైతులకు రూ.50.08 కోట్లను చెల్లించింది. అదేవిధంగా 35,526 మంది రైతులకు రూ.189.66 కోట్లు చెల్లించింది. ప్రభుత్వం అదనపు పరిహారం ప్రకటిస్తూ ఉత్తర్వులు వెలువరించిన తర్వాత రైతులకు పరిహారం కింద చెల్లింపుల కోసం 68,037 మంది రైతులకు రూ.170.50 కోట్లు అవసరమని ఉద్యానశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. జీడి పంటకు సంబంధించి 45,389 మంది రైతులకు రూ.27.55 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కొబ్బరి చెట్లకు సంబంధించి 22,648 మంది రైతులకు రూ.142.95 కోట్ల అవసరమని నివేదిక పంపారు.
15వేల మందికి పరిహారం చెల్లింపులపై సందేహాలు
తిత్లీ తుపానులో నష్టపోయిన రైతులకు అదనపు పరిహారం పొందడానికి మొత్తం 86,840 మందిని తొలుత గుర్తించారు. వీరంతా గతంలో పరిహారం డబ్బులు పొందిన వారే. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల ఒత్తిడితో అర్హుల సంఖ్యను 68,037కు కుదించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో రైతుల వివరాలను ఒకేసారి పరిశీలన చేసిన అధికారులు కొంతమంది అర్హతను నిర్ధారించాల్సి ఉంటుందంటూ పెండింగ్‌లో ఉంచడం అనేక సందేహాలకు తావిస్తోంది.
అప్పుల్లో కూరుకుపోయాం
తిత్లీ తుపానులో 135 కొబ్బరి చెట్లు నేలకొరగడంతో గత ప్రభుత్వం పరిహారం కింద రూ.2,02,500ను చెల్లించింది. ముఖ్యమంత్రి హామీతో అంతే మొత్తంలో సాయం అందుతుందని ఆశ పడ్డాను. రెండేళ్లు గడిచినా ఇప్పటికీ డబ్బులు రాలేదు. ప్రభుత్వం వెంటనే సాయం డబ్బులను జమ చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతమేర గట్టెక్కుతాం.
- పిరియా ప్రసాదరావు, ప్రగడపుట్టుగ (శ్రీకాకుళం జిల్లా)
71,765 మందిని సిఫార్సు చేశాం
అర్హులైన వారికే అదనపు పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందుకనుగుణంగా రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారుల ఉమ్మడి పర్యవేక్షణలో క్షేత్రస్థాయి పరిశీలన చేసి లబ్ధిదారులను గుర్తించాం. పరిహారం కోసం 86,840 మంది రైతుల్లో 71,765 మంది రైతులను అర్హులుగా నిర్ధారించి ప్రభుత్వానికి సిఫార్సు చేశాం. మరో 15వేల మంది వివరాలను పరిశీలించాల్సి ఉంది. అర్హులైన వారికి త్వరలో నగదు జమ చేస్తుంది.
- ఆర్‌.వి.వి ప్రసాద్‌, ఉద్యానశాఖ సహాయ సంచాలకులు, టెక్కలి