Nov 29,2020 22:27

మత్స్యకారుల సమస్యలు తెలుసుకుంటున్న హరి

ప్రజాశక్తి-యు.కొత్తపల్లి 'తుపాన్లు, వాయుగుండాలతో కోతకు గురౌతున్న ఉప్పాడ తీరప్రాంతం రక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని రాష్ట్ర అగ్నికులక్షత్రియ కార్పొరేషన్‌ చైర్మన్‌ బందన హరి తెలిపారు.' ఆదివారం ఆయన ఉప్పాడ లో సముద్రపు కోతకు గురవుతున్న తీరప్రాంతాన్ని పరిశీలించారు. గతంలో రక్షణగా వేసిన జియోట్యూబ్‌ నిర్మాణం కాపాడేదని, కానీ అది ఇప్పుడు సముద్రపు కెరటాలు థాటికి ధ్వంసం కావడంతో నీరు ఇళ్లల్లోకి చేరుతోందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కోనపాపపేట, ఉప్పాడ, సుబ్బంపేట, మాయాపట్నం తదితర తీర ప్రాంత గ్రామాల్లో గత నెలలో సంభవించిన వాయుగుండం ప్రభావంతో సుమారు 100 మీటర్ల మేర సముద్రం కోతకు గురైనట్లు మత్స్యకారులు తెలిపారు. తీర ప్రాంతంలోని ప్రతి మత్స్యకారుడికీ వచ్చేనెల 25న జగనన్న అందిస్తున్న ఇళ్ల స్థలాల పంపిణీలో మొదటి విడతలో అందరికీ ఇళ్ల స్థలాలు అందిస్తామన్నారు. ఇళ్లు కోల్పోయిన రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్‌ డైరెక్టర్‌, మాజీ ఎంపిటిసి తోటకూర మారమ్మను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఈకార్యక్రమంలో తహశీల్దార్‌ ఎల్‌.శివకుమార్‌, విశాఖ అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ సిహెచ్‌.శ్రీను, రాష్ట్ర కార్యదర్శి రావు చిన్నారావు, వైసిపి మండలాధ్యక్షుడు సుదర్శన్‌, మత్స్యకార రాష్ట్ర నాయకుడు కె.శ్రీనివాసరావు, ఉప్పాడ మాజీ సర్పంచ్‌ ఉమ్మడి జాన్‌, మాజీ ఎంపిటిసి బడే హల్లెలూయ పాల్గొన్నారు.