
అమరావతి బ్యూరో: అనేక కారణాల వల్ల ఇప్పటి వరకూ టీకా వేసుకోలేని ఫ్రంట్‌లైన్ వారియర్స్ సిబ్బంది ప్రమాణ పత్రాలు రాసివ్వాలని ఒత్తిడి చేయడం సరైంది కాదనీ వారంతా వివిధ దశలలో స్వచ్ఛందంగా టీకా వేయించుకునే అవకాశం కల్పించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సిఎం జగన్మోహన్రెడ్డి, వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్‌కు ఆయన లేఖ రాశారు. ఫిబ్రవరి నుంచి ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు టీకా వేస్తున్నా కొన్ని కారణాల వల్ల ఇప్పటికీ 48 శాతం మంది సిబ్బంది వ్యాక్సిన్ తీసుకోలేదన్నారు. ఇటువంటి వారందరినీ స్వచ్ఛంద్ర ప్రమాణ పత్రం రాసి ఇవ్వాలని వైద్యారోగ్యశాఖ అధికారులు ఒత్తిడి చేయడం సరి కాదన్నారు. పైగా టీకా తీసుకున్న వారికి ఏమైనా అయితే తమకు సంబంధంలేదని రాయించుకోవడం సరైన విధానం కాదన్నారు. కోవిడ్ వారియర్స్ అంతా వ్యాక్సినేషన్ కాలంలో ఎప్పుడైనా స్వచ్ఛందంగా టీకా తీసుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు. రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులకు కూడా టీకా పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ముఖ్యంగా కరోనా డ్యూటీలకు హాజరైన ఉద్యోగులందరికీ వెంటనే టిఎ, డిఎలు చెల్లించాలని లేఖలో డిమాండ్ చేశారు.